
రాష్ట్రపతి ఎన్నికల కోసం అసెంబ్లీలో చేసిన ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ఏఐఎంఐఎం, కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీలో ఈ పార్టీలకు ఉన్న బలం మేరకు 90.16 శాతం ఓట్లు సిన్హాకు అనుకూలంగా పోలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి కేవలం నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలే ఉండ టంతో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా కేవలం 9.84 శాతం ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు 16 మంది సోమవారం ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాష్ట్రం నుంచి లోక్‌సభలో 17, రాజ్యసభలో ఏడుగురు సభ్యులు కలుపుకొని మొత్తంగా 24 మంది ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోను న్నారు.
వారితోపాటు 119 మంది ఎమ్మెల్యేలు కూడా సోమవారం జరిగే పోలింగ్‌లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు విలువ గణింపులో ప్రత్యేక విధానం ఉంది. 1971 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకొని గణించే ఈ ఓటు విలువ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వేర్వేరుగా ఉంటుంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ మొత్తం 32,508గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment