సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం మూడు రోజుల క్రితం వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి భేటీ కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (రామాయంపేట), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (పరిగి), కుంజ సత్యవతి (భద్రాచలం) మృతి పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చ కింద రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు ఉన్న అప్పులు, ఆ తర్వాత పదేళ్లలో చేసిన అప్పులు, పదేళ్ల బడ్జెట్ అంచనాలు, వాస్తవ రాబడులు, ఖర్చు గురించి సాగునీరు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల పరిస్థితినీ వివరించనుంది. సంవత్సరాల వారీగా అప్పుల డేటాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు నీటి పారుదల రంగం గురించిన వివరణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, ఆయకట్టు, నీటి వినియోగం తదితరాలను శాసనసభలో వెల్లడించనున్నారు.
విద్యుత్ శాఖకు సంబంధించి ప్రధానంగా విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, కొత్త విద్యుత్ ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితరాలను వివరించనున్నారు. ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ప్రసంగించే అవకాశముందని సమాచారం. స్వల్పకాలిక చర్చ అనంతరం గురువారం సభ కొనసాగేదీ లేనిదీ బుధవారమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మా వాదనకు అవకాశం ఇవ్వాలి: హరీశ్‌రావు
శాసనసభలో ఆర్థిక, సాగునీరు, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నందున ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్‌కు లేఖ అందజేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలని హరీశ్ విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా ప్రభుత్వం లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రెండు రోజుల పాటు ముమ్మర కసరత్తు చేశారు.
సభలో లెక్కాపత్రాలు
Published Wed, Dec 20 2023 12:40 AM | Last Updated on Wed, Dec 20 2023 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment