అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటలను ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగి ఆదివారం ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులకు సంబంధించిన ఎజెండాను కూడా ఖరారు చేశారు. దీని ప్రకారం.. 10 ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమో దించడంతో పాటు 3 అంశాలకు సంబంధించి స్వల్పకాలిక చర్చ కూడా జరుగుతుంది. శని, ఆది వారాల్లో ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమోదించిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది.
సాయన్న మృతికి సంతాపం.. వాయిదా
శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన ఆయన చాంబర్‌లో బీఏసీ భేటీ జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా రావుతో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
సభ్యులు కోరినన్ని రోజులు సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి, వరదలపై స్వల్పకాలిక చర్చ జరపాలని అక్బరుద్దీన్ ప్రతిపాదించారు. చివరకు మూడురోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
వరదలు, విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ
శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపడతారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, విద్య, వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు– ఫలితాలు అనే అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. వివిధ అంశాలపై మొత్తం 10 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
శనివారం కూడా ఏదేని ఒక అంశంపై స్వల్పకాలిక చర్చతో పాటు బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంఐఎం సభ్యులు అఫెందీ, మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశ పెట్టే బిల్లులకు అనుగుణంగా ఎజెండాను రూపొందించారు.
ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ఇలా..
ప్రశ్నోత్తరాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో ఐటీ ఎగుమతులు, రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీపై మంత్రులు సమాధానాలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల సంఖ్య పెరుగుదల, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
శాసనమండలిలో హరితహారం, కొత్త మెడికల్ కాలేజీల మంజూరు, పంటల బీమా పథకం, పల్లె ప్రగతి, ఆసరా పింఛన్లు, హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ కోతలపై ప్రశ్నలు ఉంటాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి, గురుకులాలకు భవనాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బీరప్ప ఆలయాలకు సాయం అంశాలపై కూడా ప్రశ్నోత్తరాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment