
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల రెండోవారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఆరు నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అవి సాధ్యపడలేదు.
ఈ నెల 15న సమావేశాలు ప్రారంభించి పరిస్థితులను బట్టి 8–10 రోజులపాటు కొనసాగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్ ఖరారు కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభించి, ఎన్నిరోజులు సమావేశాలు జరపాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తమ్మీద ఈ నెల 15–20వ తేదీలోపు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.