
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి వారం పాటు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 26న బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఆరు నెలలలోపు అంటే ఈ నెల 26లోపు సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి సమావేశాలు జరిగే అవకాశాలు న్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభను వారం రోజులు, మండలిని మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ నెల రెండో వారంలోనే సమావేశాలు నిర్వహించాలని భావించినా.. వినాయక నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలిసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరపనున్నారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై ఒకట్రెండు రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశం ఉంది. దళితబంధు పథకానికి చట్టబద్దతతో పాటు ఏయే అంశాలపై బిల్లులు ప్రవేశ పెట్టాలనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.