సాక్షి, హైదరాబాద్: అయోధ్యకు వెళ్లే భక్తులకు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. శ్రీరాముడిసందర్శనకు వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా ఫిబ్రవరి 28 వరకు సికింద్రాబాద్ మీదుగా 15 రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. సాధారణ ప్రయాణికులు ఈ రైళ్లలో నేరుగా బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండదు.
విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే భక్తులకు రైల్వేసేవలు లభిస్తాయని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు తెలిపారు. భక్తులను అయోధ్యకు తరలించేందుకు, తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు వీలుగా వీహెచ్‌పీ తదితర సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ఈ నెల 22వ తేదీన జరగనున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నేరుగా వెళ్లేందుకు ఎలాంటి రైళ్లు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తారు.
ఫిబ్రవరిలో మరో 12 రైళ్లు నడుపుతారు. ‘‘ఈ నెల రోజుల వ్యవధిలో అయోధ్య సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం మొత్తం 60 రైళ్లు సిద్ధం చేస్తున్నాం. వాటిలో హైదరాబాద్ నుంచే 15 రైళ్లు నడుస్తాయి.’’ అని ఒక అధికారి వివరించారు. ఈ రైళ్లలో స్లీపర్ కోచ్‌లే ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు చార్జీ రూ.1500 వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మార్చి నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు
ఐఆర్‌సీటీసీ అయోధ్య ప్యాకేజీలు మాత్రం మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే భక్తులు అయోధ్య రాముడిని సందర్శించుకోవడంతో పాటు, స్థానిక ఆలయాల సందర్శన, భోజనం, వసతి, రోడ్డు రవాణా, తదితర సదుపాయాలతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు రూపొందించేందుకు కసరత్తు చేపట్టినట్టు ఆ సంస్థకు చెందిన అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment