
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. బెంచ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కలసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, సౌతిండియా బార్ కౌన్సిల్ కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సాధన కోసం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లతో ఏర్పడిన కమిటీ సీజేఐకి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
కక్షిదారు ఢిల్లీ వరకు రావడం ఖర్చుతో కూడుకున్నదని, ఈ విషయంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరినట్లు వివరించారు. తమ విజ్ఞప్తిపై సీజేఐ, ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సీజేఐ, ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో తమిళనాడు, ఏపీ, కర్ణాటక బార్ కౌన్సిళ్ల చైర్మన్లు పీఎస్ అమల్‌రాజ్, ఘంట రామా రావు, శ్రీనివాస్ బాబు, కేరళ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.ఎన్.అనిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెం బర్ బి.కొండారెడ్డి, రామచందర్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment