సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం అందించిన హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలంటే దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు–పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బి.కొండారెడ్డి అధ్యక్షతన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, గంటా రామారావు, పీఎస్ అమల్‌రాజ్, కేపీ జయచంద్రన్, ఎల్.శ్రీనివాసబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ వేల కిలోమీటర్ల దూరంలో ఉండటం.. సుప్రీంకోర్టు న్యాయవాదులు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల హైకోర్టుల నుంచి దాదాపు 3 శాతం మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలవుతున్నాయని వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే సమయం, డబ్బు వెచ్చించలేక అప్పీళ్లు దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు ఢిల్లీ హైకోర్టు నుంచి 9.5 శాతం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి దాదాపు 5 నుంచి 6 శాతం అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’)
దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. లా కమిషన్ చైర్మన్లు జస్టిస్ కె.కె.మాథ్యూ, జస్టిస్ దేశాయ్, జస్టిస్ లక్ష్మణన్‌లు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారని గుర్తుచేశారు. సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలంటూ అన్ని బార్ కౌన్సిళ్లు తీర్మానం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు బెంచ్ సాధన సమితి కన్వీనర్‌గా ఎ.నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment