సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అంబానీ, అదానీలవైపే ఉన్నారని, సామాన్యుల పక్షాన నిలబడడం లేదని రాజ్యసభ లో సీపీఐ పక్షనేత బినోయ్ విశ్వం విమర్శించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మోదీ మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్.. అంతా ఉత్తదేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల దేశ ప్రజలు, కార్మికవర్గం ఏమాత్రం సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా పట్టించుకో కుండా కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి చట్టం తెస్తారా? అని ప్రశ్నించారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధానకార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ కేంద్రం జాతిసంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు.
ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో మార్చిలో సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 95 శాతం మంది ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. 2024లో మోదీ ప్రభు త్వాన్ని గద్దెదించే దిశగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కాగా, తొలుత అమర్‌జిత్ కౌర్ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమర్‌జిత్ కౌర్, బి.వి.విజయలక్ష్మి, బినయ్‌విశ్వం, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యం.డి.యూసఫ్, అధ్య క్షుడు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి వి.యస్.బోస్ తదితరులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment