సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా.. ఈసారి సర్కారు అధికంగా ఇచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని పారించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్‌లో నిధులను పెంచింది. శాఖకు మొత్తంగా రూ. 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉండటంతో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాదికన్నా ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు రూ. 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాలే కీలకం కానున్నాయి.
ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో...
ఈసారి బడ్జెట్‌లో భారీ ప్రాజెక్టులకు రూ. 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ. 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపుల్లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు రూ.8 వేల కోట్ల మేర కోరారు. అయినా రూ. 918 కోట్లే్ల కేటాయించారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు కోరినా రూ. 960 కోట్లు, సీతారామకు రూ.689 కోట్లు, డిండికి రూ.545 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం రూ. వెయ్యి కోట్లు కోరగా రూ. 50 కోట్లు కేటాయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ. 400కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్‌కు కోతపడింది. ఈ ఏడాది రూ. 1,196 కోట్లే సర్దారు.
మళ్లీ రుణాలే..
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం ఒక టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతోనే కనీసం రూ. 15 వేల కోట్ల మేర ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను గట్టెక్కించేలా ప్రణాళికలు వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతలలో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం లక్ష ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100 శాతం పూర్తి చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో పనుల పూర్తికి కనీసం రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రూ. 17 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 20 వేల కోట్లకుపైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి.
‘కాళేశ్వరం’ నిర్వహణకే రూ. 7 వేల కోట్లు...
బడ్జెట్‌లో నిర్వహణ పద్దుకు కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.10,506.58 కోట్లకు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్దు కింద రూ. 5,219 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో రూ. 76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ. 44 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 32 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.
చీఫ్ ఇంజనీర్ డివిజన్‌లవారీగా ప్రగతి పద్దు కింద కేటాయింపులు (రూ. కోట్లలో)
విజన్ కేటాయింపు
రామగుండం 100
గజ్వేల్ 930
కరీంనగర్ 100
ఆదిలాబాద్ 255
నిజామాబాద్ 54
వరంగల్ 85
సంగారెడ్డి 20
నల్లగొండ 959.89
మహబూబ్‌నగర్ 25
ఖమ్మం 5
మంచిర్యాల 100
కామారెడ్డి 100
జగిత్యాల 50
ములుగు 50
సూర్యాపేట 40.30
వనపర్తి 312
నాగర్ కర్నూల్ 1,035
కొత్తగూడెం 700
హైదరాబాద్ –
ప్రధాన ప్రాజెక్టుల కింది కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో)
ప్రాజెక్టు కేటాయింపు
కాళేశ్వరం 918
పాలమూరు–రంగారెడ్డి 960
సీతారామ 689.48
డిండి 545.42
ఎస్‌ఎల్‌బీసీ 331.41
కల్వకుర్తి 75
నెట్టెంపాడు 192.75
భీమా 57
దేవాదుల 49.90
ఎల్లంపల్లి 99.88
లోయర్ పెన్‌గంగ 199.50
మిషన్ కాకతీయ 750
Comments
Please login to add a commentAdd a comment