సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఏటా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిధులు పెంచింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ నిధులు పెంచామని తెలిపారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్‌లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్‌కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.
దళితబంధుకు భారీ నిధులు
కరోనా ప్రభావం కారణంగా రెండేళ్లుగా సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దగా చేయలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, రోజువారీ జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది.
2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్‌లోనూ భారీ పెరుగుదల నమోదైంది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు పెరగడంతో.. పెండింగ్‌లో ఉన్న పథకాలు, ఇతర సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రాయితీ పథకాలకు మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment