►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి.
►తెలంగాణలో మత కల్లోలాలు లేవని, ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడారు.
►తెలంగాణలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పద్మారావు గౌడ్ స్పందిస్తూ.. తప్పుడు ఆరోపణలు చేయొద్దని శ్రీధర్ బాబుకు సూచించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడా బెల్ట్ షాపు ఉండదని అన్నారు.
►‘మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట, 10 కిలోమీటర్ల దూరంలో వైన్ షాపు ఉంటది. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతారని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతరు. అయితే గ్రామానికి, కిరణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండు. గతంలో ఎక్సైజ్ మంత్రిగా పని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది’ అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.సీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 లక్షల 29 వేల 951 మందికి లబ్ధి చేకూరింది.
► శాసనసభలో ప్రశ్నోత్తారల సందర్భంగా మన ఊరు – మన బడి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లను మన ఊరు – మన బడి పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ఒక్క ఏడాదే కొత్తగా 3 లక్షల మంది చేరారని సబిత తెలిపారు.
►సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మన ఊరు – మన బడి, కేసీఆర్ కిట్, సింగరేణి కాలరీస్ సంస్థ ప్రయివేటీకరణ, పోడు భూముల పంపిణీ, పల్లెప్రగతి, నూతన ఆస్పత్రుల ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ చేపట్టనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు Telangana Assembly Budget Session 2022 నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment