
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. 12వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. మార్చి చివరి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రభుత్వ బృందం కలవనుంది.
కాగా, తెలంగాణ సర్కార్ శనివారం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలను ప్రారంభించనుంది. పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సంఘాలచే ఆర్టీసీ అద్దె బస్సులు- మొదటి విడతలో 50 బస్సులకు పచ్చ జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లింపు, 31 జిల్లాల్లో మహిళా సంఘాలచే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు, 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్‌గా సీఎం శంకు స్థాపన చేయనున్నారు. 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇదిలా ఉండగా, ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గనుల శాఖపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీ ఎండీసీ ద్వారానే సరఫరా చేయాలన్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందని.. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా అధికారులను సీఎం ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment