సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ మొదట్నుంచీ తెలంగాణపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని.. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వకున్నా ఉన్నంతలో అభివృద్ధి చేసుకుంటుంటే ఓర్వలేకపోతున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే.. కచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించారు. తొలుత సమీకృత జిల్లా కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయాన్ని ప్రారంభించి.. అధికారులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
తర్వాత జనగామ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్–వరంగల్ హైవే పక్కన యశ్వంతపూర్ శివారులో నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ‘ఢిల్లీ కోటలు బద్దలు కొడదామా.. జాతీయ రాజకీయాల్లో పాల్గొందామా..’అంటూ కేసీఆర్ సభలో కోరగా.. టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ‘పోదాం.. పోరాడుదాం’అంటూ మద్దతు తెలిపారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టం.. ‘‘తెలంగాణపై కేంద్రం, మోదీ మొదటి నుంచీ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. ఏడేళ్లయినా కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. ఇలా ఒక్కటీ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. దేశాన్ని దోచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారిని పిక్నిక్ టూర్‌లా విదేశాలకు పంపించిన మోదీ.. ఇక్కడ రైతులు, పేదల వెంట పడ్డారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పి.. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలు పెంచి రైతుల పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేశారు.
ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం..
సమైక్య పాలనలో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మనం పెట్టుకున్న పాలసీలతో మెరుగుపడుతోంది. రైతుబంధు ఇస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజులలోపు రూ.5లక్షలు బీమా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ఎప్పుడైనా కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నమా? కేంద్రం సాయం చేయకున్నా.. కడుపు కట్టుకుని అభివృద్ధి చేసుకున్నాం. 30– 40 ఏళ్లు కరెంటు లేక, నీళ్లు రాక ఇబ్బందిపడ్డాం. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకొంటున్నాం. సాగునీటి వసతుల కల్పనతో పంటల సాగు ఘననీయంగా పెరిగింది. హైదరాబాద్‌కు, ఇతర పట్టణాలకు వలస వెళ్లినవారు తిరిగి గ్రామాలకు వస్తున్నారు. వ్యవసాయ భూముల ధరలు పెరిగాయి. ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఆకాంక్ష నెరవేరాలి. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. అప్పుడు పార్టీపరంగా, ఇతర సమస్యలను పరిష్కరించుకుందాం.
ఉద్యోగులు ఆందోళన చేయడం అసంతృప్తిగా ఉంది
జనగామలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఉద్యోగుల గురించి మాట్లాడారు. ‘‘ఇటీవల ఉద్యోగులు ఆందోళనలు చేయడం అసంతృప్తిగా ఉంది. పాలనాపరంగా పారదర్శకంగా ఉండేందుకు జోనల్, స్థానికత బదిలీలు చేపట్టామే తప్ప మరో ఆలోచన లేదు. తెలంగాణ పురోగతి కోసం పాటుపడుతున్న ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని ఆత్మగౌరవం, వేతనం ఉండటమేగాక.. ఎలాంటి పైరవీలకు తావులేకుండా పదోన్నతులు కల్పిస్తున్నాం. ఉద్యోగ విరమణ చేసే నాటికి తగిన పారితోషికం ఇచ్చి ఇంటికి సగౌరవంగా పంపించేలా చర్యలు చేపడుతున్నాం. ఉద్యోగులు తమ కృషిని మరింత కాలం కొనసాగిస్తూ.. బంగారు తెలంగాణ సాకారం కోసం తోడ్పడాలి’’ అని కేసీఆర్ కోరారు.
భూముల ధరలు.. ధనిక రాష్ట్రానికి ప్రతీక
మౌలిక వసతులు, రాయితీల కల్పనతో పంటల సాగు పెరిగి రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని.. ఇది ధనిక రాష్ట్రానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ వరకు అభివృద్ధి కారిడార్‌గా మారిందని, ఎనిమిదేళ్ల కింద ఎకరానికి రెండు లక్షల ధర ఉంటే.. ఇప్పుడు కోటి రూపాయల వరకు చేరడం ధనిక రాష్ట్రానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాలు అభివృద్ధి కేంద్రాలవుతాయని పేర్కొన్నారు.
జనగామకు మెడికల్ కాలేజీ
తెలంగాణ అమరులు కన్న కలల సాకారం కోసం జనగామ ప్రాంతంలో తాగు, సాగునీటి కల్పన చర్యలతో కరువును పారదోలామని సీఎం కేసీఆర్ చెప్పారు. గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్ రైతన్నల కన్నీళ్లు కడిగేందుకు కార్యాచరణ రూపుదాల్చుతోందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తరలిస్తామని, ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోసేలా చేస్తానని ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలతోపాటు జనగామకు మెడికల్ కళాశాల మంజూరుపై మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి బాగా చేశారని అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాడికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న దత్తాత్రేయ
సీఎం బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో అటు సూర్యాపేట–జనగామ జాతీయ రహదారి, ఇటు హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. సభ ప్రారంభం, ముగింపు సమయంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రఘునాథపల్లి మండలం మిడిగొండ వద్ద ట్రాఫిక్‌లో అరగంటపాటు ఇరుక్కుపోయారు.
– జనగామ నుంచి హనుమకొండకు వెళ్తున్న అంబులెన్స్ యశ్వంతపూర్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. అంబులెన్సును కాస్త ఎత్తి, డివైడర్ మీదుగా పక్కన రోడ్డువైపు దిగేందుకు సాయం చేశారు.
సీఎం పర్యటనలో నిరసనలు
జనగామ రూరల్/బచ్చన్నపేట:
సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్, ఏబీవీపీ, టీడీపీ నాయకులు జనగామలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా జనగామ పట్టణంలోని 16వ వార్డు టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దుబ్బాక వీరాస్వామి బహిరంగ సభకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. తాను టీఆర్‌ఎస్ నాయకుడినని చెప్పినా వినకుండా లాక్కెళ్లారంటూ.. వీరాస్వామి పోలీస్‌స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
సర్వహంగులతో జనగామ కలెక్టరేట్
జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను అత్యాధునికంగా, సర్వహంగులతో నిర్మించారు. ఏకంగా 25 ఎకరాల విశాల స్థలంలో, మూడు అంతస్తుల్లో లక్షా 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలు ఉండటం గమనార్హం. రూ.65.75 కోట్లతో కట్టిన సముదాయంలో కలెక్టరేట్, అధికారుల క్వార్టర్లతోపాటు మంత్రికోసం ప్రత్యేక చాంబర్‌ను నిర్మించారు. కలెక్టరేట్‌కు నలుదిక్కులా ద్వారాలు, వెళ్లడానికి నాలుగు లేన్ల రహదారి, చుట్టూ పూర్తి పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు.
– 300 సీటింగ్ సామర్థ్యంతో ప్రత్యేక సమావేశ మందిరం, నాలుగు లిఫ్టులు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఆడియోవీడియో వ్యవస్థతో కూడిన ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి.
– కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లలో సెంట్రలైజ్డ్ ఏసీ అమర్చారు. ప్రత్యేక సబ్‌స్టేషన్, జనరేటర్ ఏర్పాటు చేశారు.
– గ్రౌండ్ ఫ్లోర్‌లో దుకాణం, ఏటీఎం, ఇన్ఫర్మేషన్ సెంటర్, టెక్నికల్ సపోర్టింగ్ గది, చంటిబిడ్డ తల్లులకు విశ్రాంతి గది, వికలాంగులకు ర్యాంప్స్, టాయిలెట్లు నిర్మించారు.
మోదీ జాగ్రత్త.. ఇది తెలంగాణ
ఊ తెలంగాణ ప్రజల మనోభావాలను, అమరుల త్యాగాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే సహించబోం. మోదీ జాగ్రత్త.. ఇది తెలంగాణ. అవసరమైతే ఢిల్లీకోటను బద్దలు కొడతాం. దేశం నుంచి తరిమేసి తెలంగాణకు మేలు చేసే వారిని తెచ్చుకుంటాం.
మోటార్లకు మీటర్లు పెట్టం
ఊ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ విద్యుత్ సంస్కరణలంటూ ఓ అందమైన పేరుపెట్టి తెలంగాణలో కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నరు. నేను చెప్పిన. నన్ను చంపినా, çసచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టం. గతంలో చంద్రబాబు వ్యవసాయ బావులకు మీటర్లు పెడతామంటే.. ఇంకేం తెలంగాణలో మనిషికో మీటరు పెట్టండి అని మండిపడ్డాం. చివరకు ఆయనకే మీటరు పెట్టినం. పత్తా లేకుండా పోయిండు.
Comments
Please login to add a commentAdd a comment