రేవంత్‌కు తిలకం దిద్దుతున్న మహిళలు. చిత్రంలో ఎమ్మెల్యే సీతక్క
సాక్షి,ములుగు: ‘రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గత 75 ఏళ్లలో ఏ నేత చేయనివిధంగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల్లో జోష్ నింపారని’ పేర్కొన్నారు. అధికారం, ఆధిపత్యం చెలాయిస్తున్న సీఎం కేసీఆర్‌ను తుంగలో తొక్కడానికే మేడారం జంపన్నవాగు నీళ్లు తాగి, వీరవనితలైన సమ్మక్క–సారలమ్మల పోరాటగడ్డ నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలుపెట్టామని అన్నారు. సోమవారం ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకున్న అనంతరం రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు.
ప్రాజెక్టు నగర్ మీదుగా గోవిందరావుపేట మండలం పస్రా వరకు నాయకులు, కార్యకర్తల సందోహం మధ్య యాత్ర కొనసాగింది. ప్రాజెక్టునగర్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ డబ్బును నమ్ముకుంటే, కాంగ్రెస్ పార్టీ జనబలాన్ని నమ్ముకుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన, పాలకుల అసహనంతో ప్రజలు రగిలి పోతున్నారని అన్నారు. సీతక్క నా కుటుంబానికి ఎంత సన్నిహితులో రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు. సీతక్క సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో ప్రజలకు నిత్యం అండగా ఉంటుందని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దలతో చర్చించి మేడారం నుంచి జోడో యాత్ర ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
పెత్తందారుల కోసమే కేసీఆర్ రాజకీయం
గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటి నుంచి నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా.. మిగతా సొమ్ము ఎటు పోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 10 శాతం ఉన్న పెత్తందారులకు పెద్దపీట వేస్తూ, మిగతా 90 శాతం మందికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దేశంలో ఎక్కడ రాజకీయం చేయాలనుకున్నా 10 శాతం పెత్తందారుల కోసమే పనిచేస్తారని జోస్యం చెప్పారు. సీఎంకు ఎన్నో అవలక్షణాలు ఉన్నాయని, అవేవీ బయటపడటం లేదన్నారు. బడ్జెట్ విలువ, కేసీఆర్ విలువ రెండూ గుండుసున్నా అని ఎద్దేవా చేశారు.
అధికారాన్ని కాపాడుకునేందుకు మోదీ..
సాయంత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగి పస్రా జంక్షన్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ అధినేతలు ప్రాణాలివ్వగా, మోదీ మాత్రం అధికారాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు తన సోదరి తిలకం దిద్ది సాగనంపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నేడు నా సోదరి సీతక్క తిలకం దిద్ది రాచరిక పాలనను గద్దె దించాలని అడిగిందని అన్నారు. పేదలకు పట్టాభూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు రావాలంటే కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టాలన్నారు. రేవంత్ ప్రసంగం సాగుతున్న క్రమంలో సభికులు సీఎం..సీఎం.. అంటూ నినాదాలు చేశారు. సభలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాంనాయక్, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సిరిసిల్ల రాజయ్య, కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ, కూచన రవళి, పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment