సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రాజెక్టుల సాధన పేరుతో పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 26 వరకు పాదయాత్ర ఉంటుందని, యాత్ర అనుమతికోసం ఎన్నికల కమిషన్, ఎస్పీకి లేఖ రాశానని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల నుంచి హైదరాబాద్ ఈఎన్సీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన బ్రాహ్మణవెల్లంల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం సైట్‌లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వెల్లడించారు. సాగర్ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ నల్లగొండ మీద ప్రేమ ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు.
రైతులకు పోరు తప్ప మార్గం లేదు
సాక్షి, జగిత్యాల: సమస్యల పరిష్కారం కోసం రైతు లకు పోరుబాట తప్ప మరో మార్గం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం తెచ్చి న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తేనే మద్దతు ధర దక్కుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ పోరాట ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు. రైతుల కష్టాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పసుపు బోర్డుతో పాటు మామిడి బోర్డు ఏర్పాటుకు పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.
జగిత్యాలలో మాట్లాడుతున్న సీఎల్పీనేత భట్టి
మీ వల్ల తెలంగాణ రాలేదు..
కాంగ్రెస్ సేతల పదవులు కేసీఆర్ భిక్షే అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ‘మీ వల్లనో, మీ అరుపుల వల్లనో తెలంగాణ రాలేదు. పార్లమెంట్‌లో బిల్లు చేయడం ద్వారా వచ్చింది. ఆ సమయంలో అక్కడా ఇక్కడా కాంగ్రెస్ పార్టే ఉంది. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు తల్లకిందులుగా తపస్సు చేసినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నీ ఎడమకాలు చెప్పు సంగతి రైతులే చూస్తారు’అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆమనగల్లులో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
అన్నదాతలను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న కేంద్రం- రేవంత్‌రెడ్డి
16న రావిరాల వద్ద పాదయాత్ర ముగింపు సభ
ఆమనగల్లు/వెల్దండ (కల్వకుర్తి): నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశంలోని రైతుల ఆత్మగౌరవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించా రు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలను కేంద్ర సర్కారు దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర చట్టాలతో వ్యవసాయ రంగానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌కు మద్దతిచ్చిన కేసీఆర్.. ప్రధాని మోదీని కలిసిన తర్వాత చలి జ్వరంతో ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కొల్లగొట్టిన కోట్ల రూపాయల అవినీతి చిట్టా మోదీ దగ్గర ఉన్నందునే భయపడుతున్నారని ఆరోపించారు. అప్పట్లో అమెరికాలో ఉన్న కేటీఆర్‌కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
భూ సమస్యలు తీర్చని ‘ధరణి’..
అంతకు ముందు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాఘయపల్లిలో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ, రైతుల భూ సమస్యలను ధరణి వెబ్‌సైట్ తీర్చడం లేదని ఆరోపించారు. ఒకవైపు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఎత్తేసి.. మరోవైపు రైతుబంధు, రైతు బీమా పేరుతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 16న రావిరాల వద్ద నిర్వహించే పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment