సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది. కొత్త వేరియెంట్ విజృంభించే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా కేసుల్లో స్వాబ్ నమునాలను పరీక్షలకు పంపగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు చలికాలం కావడంతో ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్ జేఎన్.1 కలకలం రేగింది. దీంతో చాలామంది కరోనా పరీక్షలకు వెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఇందులో నాలుగు పాజిటివ్‌గా తేలాయి. వాళ్లకు సోకిన వేరియెంట్‌ను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు.
మరోవైపు కేంద్రం సూచనతో రాష్ట్ర వైద్య విభాగం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. కేరళ, శబరిమల నుంచి వచ్చిన వాళ్లను ట్రేస్ చేసి.. పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో యాభై బెడ్లతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. వెంటిఏటర్లు, ఆక్సిజన్ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment