సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌ను వణికిస్తున్న ‘ఏవై.4.2’రకం కరోనా కేసులు తెలంగాణలోనూ వెలుగుచూశాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ విషయం బయటపడింది. ఇద్దరిలో ఈ తరహా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్షియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 26 వేల ‘ఏవై.4.2’కేసులు జీఐఎస్‌ఏఐడీలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తన తాజా నివేదికలో పేర్కొంది.
బాధితుల వివరాలు గోప్యం
సెప్టెంబర్‌లో తెలంగాణలో నమోదైన కరోనా కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. కాగా వీటిల్లో రెండు (0.6%) ‘ఏవై.4.2’రకం కేసులు ఉన్నట్లు తేలింది. 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళకు సంబంధించిన ఆ రెండు రక్త నమూనాలు నిమ్స్ నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వచ్చాయి. ఈ మేరకు వివరాలను అక్టోబర్‌లో జీఐఎస్‌ఏఐడీకి కేంద్రం అందజేసింది. అయితే రాష్ట్రంలో బయటపడిన రెండు
ఏవై.4.2 బాధితుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడెలా ఉన్నారు? వారికి కరోనా పూర్తిగా నయమైందా? ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన చర్యలేంటన్న విషయాలపై స్పష్టత లేదు.
డెల్టా కంటే 12.4 శాతం వృద్ధి:
డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికించిన విషయం విదితమే. తెలంగాణలోనూ సెకండ్ వేవ్‌లో డెల్టాతో వేలాది మంది కరోనా బారినపడగా, వందలాది మంది చనిపోయారు. కాగా డెల్టా వేరియంట్‌లో మూడు ఉప వర్గాలున్నాయి. వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో మిగతా వాటితో పోలిస్తే అదనంగా రెండు మ్యుటేషన్లు ఉన్నాయి.
ఏ222వీ, వై145హెచ్ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడాగా చెబుతున్నారు. ఇక ఏవై.4.2 డెల్టా వేరియంట్ వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిర్ధారిం చారు. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా, డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కేసులు పెరుగుతున్నాయే కానీ, మరణాలు పెద్దగా లేవని చెబుతుండటం కొంత ఊరటనిస్తోంది.
అప్రమత్తంగా ఉండాల్సిందే..
వాస్తవానికి ఏవై.4.2 కేసులు కొన్నింటిని జూలైలోనే మన దేశంలో గుర్తించారని, కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదని నిపుణులు అంటున్నారు. అయితే ఏవై.4.2 రకం కేసులు ఇంకా తెలంగాణలో ఎన్ని ఉండొచ్చన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏమరుపాటు తగదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment