
కరోనా భయాలు ఇప్పట్లో వీడేలా లేవు. మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. గత వారం రోజులుగా గ్రేటర్ పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల డిశ్చార్జి కంటే..కొత్తగా అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కోవిడ్ వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే అనేక మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్...తాజాగా డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందిందనే ప్రచారం సిటీజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 70 కేసులను గుర్తించగా, వీటిలో రెండు కేసులు తెలంగాణలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఒకరు ఓ వైద్యుడి బంధువు కాగా, మరొకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ కేసులపై వైద్య ఆరోగ్యశాఖ అత్యంత గోప్యతను పాటిస్తుండటం గమనార్హం. సర్వైలెన్స్ విభాగం ఇప్పటికే ఆయా బాధితులతో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారి నుంచి కూడా నమూనాలు సేకరించి ఐసీఎంఆర్‌కు పంపినట్లు సమాచారం. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఇప్పటి వరకు తమ వద్ద డెల్టా ప్లస్ కేసులు రిపోర్ట్ కాలేదని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కేసులన్నీ డెల్టా వేరియంట్ కేసు లేనని చెప్పుతుండటం విశేషం.
చాపకింద నీరులా...
► ఏప్రిల్, మేలో విశ్వనగరంలో విశ్వరూపాన్ని ప్రదర్శించిన కరోనా వైరస్ జూన్ నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది.
► ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రోజుకు సగటున 150పైగా కేసులు నమోదవుతున్నాయి. గాంధీలో ప్రస్తుతం 370 మంది చికిత్స పొందుతుండగా, వీరి లో సగానికిపైగా మంది గ్రేటర్ జిల్లాల వారే.
► పక్షం రోజుల క్రితం గాంధీలో కొత్త అడ్మిషన్ల కంటే..డిశ్చార్జీలే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం ఇందుకు భిన్నంగా ఉంది. కొత్తగా రోజుకు 30 మందికిపైగా అడ్మిటవుతుంటే...20 మంది మాత్రమే డిశ్చార్జ్ అవుతున్నారు.
► కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు భావించి సాధారణ సేవలను పునరుద్ధరించేందుకు గాంధీ వైద్యులు సిద్ధం అవుతుండగా..ప్రస్తుతం మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 9141 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్ జిల్లాల్లోనే మూడు వేలకుపైగా క్రియాశీల కేసులు ఉండటం గమనార్హం.
వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు
కోవిడ్ వైరస్ పూర్తిగా పోవడం వల్లే ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసినట్లు చాలా మంది భావిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారు. భౌతిక దూరం పాటించడం లేదు. మార్కెట్లు, హోటళ్లు, మాల్స్ జనంతో రద్దీగా మారుతున్నాయి. నిజానికి వైరస్ పూర్తిగా పోలేదు. కేవలం కేసుల సంఖ్య మాత్రమే తగ్గింది. పర్వదినాల్లో సిటిజన్లు పెద్ద సంఖ్యలో జమవుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమవుతున్నారు. జాగ్రత్తలు పాటించకుండా..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్ ముప్పు తప్పదు. డెల్టా వేరియంట్ కాస్తా..డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందితే పరిస్థితి విషమిస్తుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment