సాక్షి, హైదరాబాద్: అదిగో డబుల్ డెక్కర్.. ఇదిగో డబుల్ డెక్కర్ అంటూ ఊరించిన ఆర్టీసీ చివరకు వాటి ధరతో హడలిపోతోంది. అవసరమైన నిధులపై మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం నగరంలో కొత్తగా 25 డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టాలంటే ఇప్పటికిప్పుడు రూ.17 కోట్లు కావాలి. అన్ని డబ్బులు లేకపోవడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులకు ఆర్డర్ ఇవ్వలేకపోతోంది. అయితే హైదరాబాద్ సిటీ షాన్‌ను తిరిగి తెప్పించేందుకే ఈ బస్సులు కొనాలనుకున్నందున.. ఆ ఖర్చును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ భరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా కేటీఆర్‌దే కావటంతో సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే ఆశాభావంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
ఒక్కో బస్సు రూ.68 లక్షలు..
మొదట్లో 40 బస్సులు ప్రారంభించాలని భావించినా వాటికయ్యే వ్యయం దృష్ట్యా 25 బస్సులకు పరిమితమయ్యారు. ఈ మేరకు టెండర్లు పిలవగా, ఐషర్, అశోక్ లేలాండ్, వీరవాహన, ఎంజీ కంపెనీలు స్పందించాయి. చివరకు అశోక్ లేలాండ్ టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు చొప్పున ధర కోట్ చేసింది. అయితే టీఎస్‌ఆర్టీసీ చర్చల నేపథ్యంలో చివరకు రూ.68 లక్షలకు ఖరారు చేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత ధర పెట్టి 25 బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేకపోవటంతో కొనుగోలు దిశగా ముందుకు వెళ్లలేకపోతోంది.
ఆ అప్పులోంచి డబ్బులిచ్చినా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఆర్టీసీ ఓ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది. వివిధ రూపాల్లో చెల్లించాల్సినవి రూ.2 వేల కోట్లు, దగ్గరున్నవి రూ.500 కోట్లే కావటంతో సీఎంతో చర్చించిన ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పూచీకత్తు ఇవ్వగా, ఆ బ్యాంకు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మిగతా రూ.500 కోట్లను మరోచోట నుంచి తెచ్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అదే అప్పు నుంచి డబుల్ డెక్కర్ బస్సులకు నిధులు కోరే ఆలోచనలో ఉంది. ఆశించిన విధంగా మంత్రి కేటీఆర్ స్పందించినా, రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు అప్పు నుంచి వాడుకునేందుకు అనుమతించినా.. కొత్త డబుల్ డెక్కర్ బస్సుల్ని మరోసారి భాగ్యనగరంలో పరుగులు తీయించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది.
ఒక ట్వీటు .. వెంటనే స్పందన
డబుల్ డెక్కర్లు ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇతర ప్రాంతాల నుంచి నగర పర్యటనకు వచ్చినవారు ఈ బస్సులో ఒకసారైనా పైన కూర్చొని ప్రయాణించకుండా వెళ్లేవారు కాదు. సికింద్రాబాద్–మెహిదీపట్నం వంటి కొన్ని పరిమిత రూట్లలో ఈ బస్సులు నడిచేవి. వీటిల్లో సికింద్రాబాద్–అఫ్జల్‌గంజ్–జూ పార్క్ రూటు బాగా ప్రజాదరణ పొందింది. గత ఏడాది నవంబర్ 7న నగరవాసి ఒకరు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్–జూపార్క్ 7 జడ్ నంబర్ పాత డబుల్ డెక్కర్ ఫొటోను పంచుకుంటూ.. నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వస్తే బాగుంటుందని ట్వీట్ చేశాడు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అప్పట్లో హైదరాబాద్‌కు అలంకారంగా ఉన్న ఆ బస్సులను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదని పేర్కొన్నారు. అవకాశం ఉంటే మళ్లీ నడిపే అంశాన్ని పరిశీలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచిస్తూ ట్వీట్ చేశారు. దీనికి పువ్వాడ వెంటనే ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడటంతో డబుల్ డెక్కర్ల కొనుగోలు తెరపైకి వచ్చింది.
ప్రతిపాదిత రూట్లు ఇవే..
- నం.219: సికింద్రాబాద్–పటాన్‌చెరు వయా బాలానగర్
- 229: సికింద్రాబాద్–మేడ్చల్ వయా సుచిత్ర
- 218: కోఠి–పటాన్‌చెరు
- 9 ఎక్స్: సెంట్రల్ బస్‌స్టేషన్–జీడిమెట్ల
- 118: అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం
Comments
Please login to add a commentAdd a comment