
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఎంసెట్ కమిటీ సమాయత్తమవుతోంది. కరోనా నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలపై దృష్టి సారించింది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షల నిర్వహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో తెలం గాణలో 89 కేంద్రాలను, ఆంధ్రప్రదేశ్‌లో 23 కేంద్రా లను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు లేని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది. కరోనా సంబంధ లక్షణాలున్న వారిని వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. వీలైతే ఆ సెషన్‌లో ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. పరీక్ష కేంద్రంలో ఉన్న వసతులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. లేదంటే వారికి తదుపరి సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టా లని నిర్ణయించింది. అలాంటి విద్యార్థులు ఎంసెట్ కమిటీ హెల్ప్‌డెస్క్‌కు తెలియజేసేలా చర్యలు చేపడుతోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేలా విద్యార్థుల హాల్‌టికెట్లలోని నిబంధనల్లో పొందు పరిచింది. విద్యార్థులు మాస్క్‌లు తెచ్చుకోవాలని, వాటిని ధరించాలని, 50ఎంఎల్ శానిటైజర్ బాటిల్‌తోపాటు వాటర్ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. కరోనా కారణంగా ఈసారి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయడం లేదు. వేలి ముద్రలు తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం(ఫొటో రికగ్నైజేషన్) అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
గంటన్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి
ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నాలుగు రోజులపాటు ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షల నిర్వహణ షెడ్యూలు ఖరారు చేసింది. ప్రతి సెషన్‌లో విద్యార్థులను గంటర్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతించనుంది. ఉదయం 7:30 నుంచి, మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతించనున్నారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతోపాటు హాల్‌టికెట్, ఆధార్ వంటి ఏదేని ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌తోపాటు టెస్టు సెంటర్ రూట్‌మ్యాప్ ఇస్తున్నందున విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రం చూసుకోవాలన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం చేయించి, విద్యార్థులు తమ ఎడమచేతి వేలిముద్ర వేసి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని నిబంధనల్లో పేర్కొంది. దానిని అందజేయకపోతే ఆ విద్యార్థి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతామని వెల్లడించింది. రఫ్ వర్క్ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చివేయాలని పేర్కొంది.
వచ్చేనెల మొదటి వారంలో ఫలితాలు
ఎంసెట్ ఫలితాలను వచ్చే నెల మొదటి వారంలో విడదల చేసేలా ఎంసెట్ కమిటీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తుండటం, అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులే ఉండటంతో అక్టోబరు మొదటివారంలోనే ఫలితాలను విడుదల చేసేలా చర్యలు చేపట్టింది. మొత్తానికి నవంబరు మొదటి వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక అగ్రికల్చర్ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష రోజు ఏదైనా జాతీయ స్థాయి పరీక్ష ఉంటే ఆ పరీక్ష రాసే విద్యార్థులు కోరితే వారికి మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment