వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్‌ | Telangana to Establish Advanced Hi Tech Passenger Coach manufacturing facility: Kishan Reddy | Sakshi
Sakshi News home page

వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్‌

Published Fri, Oct 25 2024 5:41 AM | Last Updated on Fri, Oct 25 2024 5:41 AM

Telangana to Establish Advanced Hi Tech Passenger Coach manufacturing facility: Kishan Reddy

రూ.680 కోట్లతో సాగుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులు 

ఏటా 600 ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల నిర్మాణం.. 3000 మందికి ఉపాధి 

తెలంగాణలో 15 ప్రాజెక్టులకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే 

ఎంపీల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)ను వచ్చే ఆగస్ట్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మన్‌ బుష్‌) కోచ్‌లు, ఈఎంయూ (ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) కోచ్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏటా 600 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యంతో కాజీపేట యూనిట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గురువారం దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్‌ సభ్యుల సమావేశం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో జరిగింది.

ఈ సందర్భంగా పలు పెండింగ్‌ సమస్యలను ఎంపీలు ప్రస్తావించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట్లో రూ.250 కోట్లతో కాజీపేట్‌లో ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, ప్రస్తుతం దానిని రూ.680 కోట్లతో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు మూడువేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద చేపట్టిన 40 రైల్వేస్టేషన్‌ల పునరాభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.780 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని తెలిపారు.  

15 ప్రాజెక్టులకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే 
దక్షిణమధ్య రైల్వేలో 15 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పూర్తయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్లతో 2647 కి.మీ. రైల్వేలైన్‌లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ. 17,862 కోట్ల అంచనాతో 1,447 కి.మీ. డబ్లింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్‌ కేంద్రంగానే అత్యధికంగా 5 వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో భూమి లభించకపోవడం వల్ల ఎంఎంటీఎస్‌ రెండో దశతోపాటు పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రూ.650 కోట్లతో రాయగిరి నుంచి యాదాద్రి వరకు 31 కి.మీ. వరకు ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా చేపట్టనుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన రైల్‌రింగ్‌రోడ్డుకు సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.  

ప్రాధాన్యతల కోసం కసరత్తు
రానున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకొని దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ఈ ఎంపీల సమావేశంలో తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, డీకే అరుణ, కడియం కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డితోపాటు సాగర్‌ ఈశ్వర్‌ ఖండ్రే (బీదర్‌), రాధాకృష్ణ దోడ్డమణి (కలబురిగి) పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీలు నత్తనడకన సాగుతున్నాయని, సకాలంలో పూర్తయ్యేలా గడువు విధించాలని ఈటల సూచించారు.

ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్‌ల ను పునరుద్ధరించాలని రఘునందన్‌రెడ్డి కోరా రు. ఏటా రెండుసార్లు ఎంపీల సమావేశం పెట్టి సమస్యలపై చర్చించాలని సురేశ్‌రెడ్డి సూచించా రు. దేవరకద్ర, కౌకుంట్ల, జడ్చర్ల ప్రాంతాల్లోని ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీలను సకాలంలో పూర్తి చేయాలని డీకే అరుణ కోరారు. కాజీపేట రైల్వే ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కలి్పంచాలని కడియం కావ్య కోరారు. ఎంపీల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఉంటుందని జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌ చెప్పారు. 2023–24 ఆర్థిక ఏడాదిలో 141 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాద్వారా అత్యధికంగా రూ.13,620 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement