ఎంపీల చేతికి ‘పవర్‌’! | Telangana: Establishment of District Level Electricity Committees | Sakshi
Sakshi News home page

ఎంపీల చేతికి ‘పవర్‌’!

Published Sun, Sep 19 2021 1:57 AM | Last Updated on Sun, Sep 19 2021 1:57 AM

Telangana: Establishment of District Level Electricity Committees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ కోసం స్థానిక ఎంపీ నేతృత్వంలో జిల్లా స్థాయి విద్యుత్‌ కమిటీలను ఏర్పాటు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అత్యంత సీనియర్‌ ఎంపీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కో–చైర్మన్లుగా జిల్లా లోని ఇతర ఎంపీలు, సభ్యకార్యదర్శులుగా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్‌ ఇంజనీర్, సభ్యులుగా జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను నియమించాలని సూచించింది. కనీసం 3 నెలలకోసారి ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు కేంద్రం అప్పగించింది. విద్యుత్‌ రంగంలో కేంద్ర సంస్కరణలు,  పథకాల అమలు తీరుపై ఈ కమిటీ సమీక్ష జరుపుతుంది. ఈ కమిటీ ఏర్పాటుతో జిల్లా స్థాయిలో సీనియర్‌ ఎంపీలు ‘పవర్‌ ఫుల్‌’గా మారనున్నారు. కేంద్ర పథకాల అమలు, శాఖ పనితీరు, రైతులు, వినియోగదారుల సమస్యలు వంటి అంశాలపై జిల్లా విద్యుత్‌ అధికారులు ఈ కమిటీకి నిత్యం సమాధానం ఇచ్చుకునే పరిస్థితి రానుంది.  

కొత్త సంస్కరణల అమలుకే.. 
దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ఇటీవల కేంద్రం రూ.3 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించింది. జిల్లా స్థాయిలో ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు సీనియర్‌ ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నిర్ధేశించిన సంస్కరణలను అమలు చేస్తేనే డిస్కంలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందనుంది. ప్రధానంగా నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలతో డిస్కంలు ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి ఈ పథకం కింద నిధులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లను బిగించడానికి కేంద్రం ఈ పథకం కింద తన వాటాగా రూ.22,500 కోట్లు కేటాయించింది. ఇతర సంస్కరణల అమలుకు రానున్న ఐదేళ్లలో కేంద్ర వాటాగా రూ.97,631 కోట్లను డిస్కంలకు అందజేయనుంది. ఈ పథకంతో పాటు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం, కుసుమ్‌ వంటి కేంద్ర పథకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement