
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడెంలో మంగళవారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సయ్య, కారులో ఇల్లెందు బయలుదేరారు. ఆయనతో పాటు సోదరుడి కుమారుడు వర్మ ఉన్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా దాటాక రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలో.. ఇల్లెందు నుంచి ఎదురుగా దూసుకొచ్చిన లారీ డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేశాడు.
దీంతో లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నర్సయ్య కాలు, చేతికి స్వల్ప గాయాలు కాగా, కొత్తగూడెం వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు తన వాహనంలో గుమ్మడి నర్సయ్యను తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.