నిశీధి నీడలు ఆదర్శాల జాడలు
గిరిజన శాసనసభ్యుడు మనోరంజన్ దేబ్ వర్మ కృషి, పట్టుదల, ప్రజాసేవ పట్ల నిబద్ధతల వల్ల మాండ్వి దేశానికే ఆదర్శంగా మారింది. ఖతీరాం బాడి గిరిజన గ్రామాన్ని చూస్తుంటే, దేశంలోని గ్రామాలన్నీ ఇలా మారిపోతే, మన నేతలంతా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పార్టీలు మారుతున్న మన ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్టు అధికారంలో లేకపోతే ప్రజా సేవ చెయ్యలేకపోవడం అన్నది ఉత్తిమాట. మనోరంజనే కాదు, ఒకప్పటి మన పుచ్చలపల్లి, వావిలాల, నేటి గుమ్మడి నర్సయ్య వంటి నేతలే అందుకు నిదర్శనం.
ఈశాన్య భారతంలో త్రిపుర చాలా చిన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే, త్రిపురలో ఉన్నవి ఎనిమిది జిల్లాలే. జనాభా దాదాపు నలభై లక్షలు. ఈ రాష్ట్రం నుంచి లోక్సభలో ఇద్దరికే ప్రాతినిధ్యం ఉంది. దశాబ్దాల తరబడి మార్క్సిస్ట్ల ఏలుబడిలో ఉండటం వల్ల, లోక్సభలో చెప్పుకోదగినంత సంఖ్యా బలం లేదు కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా త్రిపుర రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ. పశ్చిమ త్రిపుర జిల్లాలోని మాండ్వి శాసనసభ నియోజకవర్గం(ఎస్టీ)లో ఉన్నవి 12,910 కుటుంబాలు.
మొత్తం జనాభా 55,050 మంది. ఇందులో 95 శాతం గిరిజనులే. 1972 మొదలు ఇక్కడి నుంచి ఒకే గిరిజన కుటుంబానికి చెందిన వారు శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. మొదట నాలుగుసార్లు తండ్రి, ఆ తరువాత కొడుకు ఇప్పటి వరకు శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. వీరెప్పుడూ పార్టీ మారే ఆలోచనలు చెయ్యలేదు. అధికారంలో ఎవరున్నారో చూడలేదు. అయినా ఇవ్వాళ దేశం చెప్పుకోదగ్గ నియోజక వర్గాల జాబితాలో చేరిపోయింది మాండ్వి. అందుకు అక్కడి శాసనసభ్యుడితో పాటూ అధికార యంత్రాంగం నిబద్ధత, కృషి, పట్టుదల తోడయ్యాయి.
ఆదర్శ నేత.. ఆదర్శ గ్రామాలు
నేడు మాండ్వి ఒక ఆదర్శ శాసనసభా నియోజకవర్గం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రం గుర్తింపు పొందిన నియోజకవర్గం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి జాతీయ గ్రామీణ ఆర్థిక కార్యక్రమం (ఎన్ఆర్ఎఫ్ఐపీ) వరకు గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతా లకు కేంద్ర నిధులు లభించే ఏ పథకాన్నీ వదలకుండా తమ నియోజకవ ర్గానికి తెచ్చుకుంటున్న మాండ్విలో పర్యటించడం ముచ్చట గొలిపే అను భవం. ఆ నియోజకవర్గంలోని సామాన్య ప్రజలందరి వివరాల ‘‘ఈ రికార్డింగ్’’ జరిగిపోయింది. అత్యధిక శాతం ప్రజల వివరాలు ఆధార్ పథకం కింద నమోదయ్యాయి. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఆధ్వ ర్యంలో మాండ్వి నియోజకవర్గంలోని ఖతీరాం బాడి గ్రామంలో గిరిజన కుటుంబాల కోసం రూ. 75,000 వ్యయంతో నిర్మించిన ఇళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఇంటికి ఒక విశాలమైన గది, వెనక ప్రత్యేకంగా ఒక వంట గది, ప్రతి ఇంటి ఆవరణలోనూ మరుగుదొడ్డి ఆకట్టుకుంటాయి. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పంపు, అవాంతరాలే లేని నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. ఈ సదుపాయాలే కాదు, వారికి అదనపు రాబడినిచ్చేలా వెదురు బొంగుల సేద్యానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. పది గిరిజన కుటుం బాలు ఒక యూనిట్గా జరిగే ఈ సేద్యం వల్ల ఒక్కొక్క కుటుంబానికి సంవ త్సరానికి కనీసం ఐదు లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది.
పిల్లలు చదువుకోవడానికి బడి, అనారోగ్యం పాలైతే వైద్యం ఇటువంటి అద్భుతాలన్నీ ఆ నియోజకవర్గంలో సోమవారం జరిపిన పర్యటనలో కనిపించాయి. ఇవన్నీ ఆ నియోజకవర్గం నుంచి దీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఎన్నిక వుతూ ఉన్న మనోరంజన్ దేబ్ వర్మ కృషి, పట్టుదల, ప్రజాసేవ పట్ల ఆయనకు గల నిబద్ధతల ఫలితం. ఆయన తండ్రి రశీరాం దేబ్ వర్మ కొంత కాలం వామపక్ష సంఘటన ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈయనకు అవేమీ పెద్ద విషయాలు కావు. మంత్రి కావాలనో, పదవిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించి సంపన్న వర్గాల జాబితాలో చేరిపోవాలనో ఆయనలో దుగ్ధ కనిపించదు. త్రిపుర రాష్ట్ర గ్రామీణ జీవితం ఎట్లా ఉంటుందో చూడాలని సోమవారం మేం పశ్చిమ త్రిపుర జిల్లాలోని మాండ్వి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మా వెంట ఉన్న సీనియర్ శాసనసభ్యుడు మనోరంజన్ దేబ్ వర్మను చూస్తుంటే దేశంలోని రాజకీయ నాయకులంతా ఇట్లా ఉంటే బాగుండేదనిపించింది. గ్రామీణ ప్రాంతాలన్నీ బాగుపడి ఖతీరాం బాడి గ్రామంలా మారిపోతాయి.
చెరిగిపోతున్న ఆదర్శ నేతల అడుగుజాడలు...
నిజాయితీగా ప్రజా సేవకే అంకితమైన నాయకులు, అందునా దళిత గిరిజన వర్గాల నుంచి వచ్చే నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కసిపిస్తూ ఉంటారు. పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లే వారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్కాగజ్నగర్ నియోజకవర్గానికి పాల్వాయి పురుషోత్తంరావు అనే శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఒక రోజు ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో చేరారని తెలిసి పరా మర్శకు వెళ్లాం. అప్పుడు తెలిసింది... ఆయనకు ఎటువంటి వాహనమూ లేదని. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభకు నడిచే వెళుతుంటే వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొని ప్రమాదం జరిగిందట. సీపీఐ ఎంఎల్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్య కుటుంబానికి ఇప్పటికీ పొలంలో వ్యవసాయమే జీవనాధారం. ఎమ్మెల్యేగా ఉండగా కూడా, సమావేశాలు లేని రోజుల్లో ఆయన తన గ్రామంలో అరక దున్నేవారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అతి సన్నిహితుడైన జువ్వాది చొక్కారావు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. ఆయనకు సొంత ఇల్లు లేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక వావిలాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకుల నిరాడంబర జీవితం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇట్లాంటి వాళ్లు ఇంకా ఉంటారు.
గోడ దూకే నేతల తీరే వేరు
మనోరంజన్తో కలిసి తిరిగి, మళ్లీ హైదరాబాద్కు చేరేసరికి... ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిపక్ష శాసనసభ్యుడు వలస పక్షుల జాబితాలో చేరిపోయారనీ, అధికార పక్షంలో చేరుతున్నారని వార్త వచ్చింది. దీంతో వావిలాల గోపాల కృష్ణయ్య దగ్గరి నుంచి మనోరంజన్ దేబ్ వర్మ దాక ప్రతిఫలాపేక్ష లేని నాయ కులందరూ జ్ఞాపకం వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు, ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్య క్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అధికారికంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి రాజీనామా లేఖను పంపారు.
ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం. ఇటీవల ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి గోడ దూకిన శాసనసభ్యుల్లో నెహ్రూ తొమ్మిదో వారవు తారు. ముగింపుకొస్తున్న ఆ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఇక నెహ్రూ కూడా, మిగిలిన ఎనిమిది మంది లాగానే కనిపించరు, మాయం అయిపో తారు! శాసనసభలో దర్జాగా కూర్చోవాల్సిన ఎమ్మెల్యేలు ముఖం చాటే య్యాల్సి రావడమేమిటి? రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సర్వసాధా రణం. అందుకోసం పార్టీని వీడొచ్చు. పార్టీ సభ్యత్వంతో పాటూ, పార్టీ బీ ఫాం మీద ఎన్నికైన శాసన సభ్వత్వానికి కూడా రాజీనామాచేసి, మళ్లీ జనం మధ్యకు వెళ్లి గెలిచి వస్తే, జనం శభాష్ అంటారు కదా!
ప్రజలకు సంబంధంలేని పార్టీ మార్పిడులు
పార్టీ పదవులకు రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసన సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రతిపక్షం నుంచి రాజీ నామా చేసి, అధికార పక్షానికి వలస పోయిన, పోతున్న శాసనసభ్యులు ఒక్కరయినా సరైన కారణం చెప్పగలరా? నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతున్నాం, ప్రజల బాగుకోసం పోతున్నాం అంటారా? ఈ పార్టీ మార్పిడు లకూ, ప్రజలకూ ఏమైనా సంబంధం ఉందా? శాసనసభ మీడియా పాయింట్ దగ్గర మంగళవారం ఇద్దరు ప్రతిపక్ష మహిళా శాసనసభ్యులు ... మాకు రూ. 20 కోట్లు ఇవ్వజూపారు అని చెప్పారు. కచ్చితంగా ఇటువంటి ఏవో ప్రలోభాల కారణంగానే ఈ పార్టీ మార్పిడులు జరుగుతున్నాయనే బలమైన అభిప్రాయం ప్రజలలో ఉంది.
అదే నిజమైతే ఇలా చేతులు మారే డబ్బును వారు ప్రజల బాగు కోసం ఏమన్నా ఖర్చు చేస్తారా? లేదు కదా. కాబట్టి ఈ పార్టీ మార్పిడులతో ప్రజలకు ఏ సంబంధమూలేదు. లేదూ ప్రజలే పార్టీ మారమని కోరుతుంటే... శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల చేత అవునూ అనిపించుకుని శాసనసభకు వస్తే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సేవ చెయ్యలేకపోవడం అన్నది ఉత్తి మాట. పైన ఉదహరించిన పెద్దలంతా ప్రతిపక్షంలో ఉండే ప్రజా సేవ సమర్థ వంతంగా చేశారు. ఎక్కడ ఎవరు గీత దాటుతున్నా వారిని ప్రజలు చూస్తు న్నారు. సమయం వచ్చినప్పుడు తమ తీర్పును కచ్చితంగానే చెప్తారు.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com