సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల విభాగం, కేంద్ర విద్యా విభాగం వర్చువల్ విధానంలో ‘యంగ్ అచీవర్స్’ పోటీని సోమవారం నిర్వహించింది. దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు పోటీలో పాల్గొన్నారు. ఎంహెచ్‌ఆర్‌డీ సెక్రటరీ అనితా అగర్వాల్ సహా పలువురు కేంద్ర విద్యారంగ నిపుణులు నిర్వహించిన ఈ సెమినార్‌లో మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నలుగురు బాలికలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన అభినందించారు.
భయాన్ని అధిగమించి..
కె.సోను (మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల కేజీబీవీ)ది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయదారుడు. ఆమె 5వ తరగతిలో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆన్‌లైన్ జూమ్ కోచింగ్ ద్వారా కేజీబీవీలో సీటు పొందింది. అక్కడ అంతా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే భయపడింది. వార్డెన్ ఇతర టీచర్ల సాయంతో ఆ భయాన్ని అధిగమించింది. తర్వాత ఆమె ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది.
‘సైబర్’పై సమరం
కషిష్ సింగ్.. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి విద్యార్థిని. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా రక్షణ విభాగం, తెలంగాణ పోలీసు, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సైబర్ కాంగ్రెస్‌లో శిక్షణ పొందింది. సైబర్ సెక్యూరిటీలో అత్యుత్తమ ప్రతిభను సొంతం చేసుకుంది. సైబర్ సెక్యూరిటీపై స్కూల్స్, తన పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
చదవండి: హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి..
శానిటరీ ప్యాడ్స్ చేసి..
ధీరావత్ అనిత యాదాద్రి జిల్లా ముల్కలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో టెన్త్ చదువుతోంది. తండాల్లో ఉండే గిరిజన మహిళలు రుతుస్రావ సమయంలో సాధారణ బట్టవాడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. వారి వేదనను దగ్గర్నుంచి చూసిన ఈ బాలిక... స్థానికంగా లభించే వేపాకులు, మెంతులు, కొన్ని రకాల పూలు, పసుపు పొడి, వృథా పేపర్లను వాడి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేసి అందించింది.
‘వలస’ వెతలపై..
జి.శ్రీజ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కుర జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. 6వ తరగతి నుంచి సామాజిక ఇతివృత్తంతో కథలు రాసేది. 20 కథలతో ఓ పుస్తకం కూడా ప్రచురితమైంది. కరోనా సమయంలో ఆమె రాసిన వలస కూలీలు కథనం రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందింది.
ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’ ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇద్దరు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం చేశారు. సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో 2021–2022కి గాను 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రతోపాటు ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ పురస్కారాలను అందుకున్నారు. గత మార్చిలో విరాట్ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలీ మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. కాగా, జమ్మూలోని సుంజువన్ మిలిటరీ క్యాంపుపై టెర్రరిస్టుల దాడిలో చాకచక్యంగా వ్యవహరించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గురుగు హిమప్రియకూ ఈ పురస్కారం అందించారు. వీళ్లు ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment