సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.50 లక్షల కోట్లకు అటూ ఇటుగా బడ్జెట్ ప్రతిపాదనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది (2021–22)కి రూ.2.30 లక్ష కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుంచిన ప్రభుత్వం.. ఈసారి మరో 9–10 శాతం అదనంగా బడ్జెట్ ప్రతిపాదించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి బడ్జెట్‌కు రూప కల్పన చేశారని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుందనే చర్చ జరుగుతోంది.
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కూడా దీటుగా ఎదుర్కొనేలా వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈసారి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. దీంతో పాటు మన ఊరు–మన బడి, డిజిటల్ క్లాస్‌రూంలు తదితర పథకాల కోసం విద్యా రంగ బడ్జెట్ కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలకు సరిపడా అంచనాలను రూపొందించినట్టు సమాచారం. సంక్షేమ పథకాల్లో ప్రధానంగా.. ప్రతిష్టాత్మక దళితబంధుకు ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఖచ్చి తంగా రూ.15–20 వేల కోట్లు ప్రతిపాదించనుంది. దీంతో పాటు బీసీ, ఎంబీసీలకు కూడా ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, ఇందుకు తగిన బడ్జెట్‌ను కేటాయించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీలేని రుణాలు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించనున్నారు.
సాగునీటి రంగానికి తగ్గనున్న నిధులు!
ఈసారి సాగునీటి రంగానికి నిధులు తగ్గుతాయనే చర్చ జరుగుతోంది. గత ఏడాది రూ.11,693 కోట్లు ప్రతిపాదించగా.. ఈసారి రూ.10 వేల కోట్ల వరకే పరిమితం కావచ్చని తెలుస్తోంది. కృష్ణానదిపై పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు సరిపడా కేటాయింపులు చూపెడతారని, సంగమేశ్వర ప్రాజెక్టుకు రుణ సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రతిపాదించనున్నారని సమాచారం.
సొంత ఆదాయంపైనే ధీమా
ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ అధికారులు ప్రధానంగా సొంత పన్నుల ఆదాయంపైనే ఆధారపడి కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల్లో వాటాపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏకంగా రూ.38 వేల కోట్లకు పైగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుందని ఆశించినా, రూ.10 వేల కోట్లు కూడా రాలేదు. దీంతో ఈ ఒక్క పద్దులోనే భారీ అంచనా లోటు కనిపిస్తోంది. దీంతో పాటు పన్నుల్లో వాటాను కూడా కేంద్రం ఈసారి పెంచలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల ప్రతిపాదనలను తగ్గించి చూపెట్టనున్నారు.
అదే సమయంలో గత రెండేళ్లతో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ఆదాయం భారీగా పెరగడంతో వచ్చే ఏడాది కూడా భారీగానే పన్నుల ఆదాయం ఉంటుందనే అంచనాతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.20 వేల కోట్ల వరకు పన్ను ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. రెండుసార్లు భూముల ప్రభుత్వ విలువల సవరణ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపుదలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏడాదికి రూ.18 వేల కోట్లకు చేరింది. ఎక్సైజ్ శాఖ ద్వారా గత ఏడాది రూ.16 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈసారి దాన్ని స్వల్పంగా పెంచి.. మొత్తం మీద ఈరెండు శాఖల ద్వారానే రూ.35 వేల కోట్ల వరకు ఆదాయాన్ని ప్రతిపాదించనున్నారు. అలాగే పన్నేతర ఆదాయం కూడా ఈసారి భారీగా చూపెట్టనున్నట్టు సమాచారం.
సభ ఆమోదం కోసం సవరణల బడ్జెట్
2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, సవరణల బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.2.10 లక్షల కోట్లకు తగ్గిందని తెలుస్తోంది. ఈ మేరకు సవరణల బడ్జెట్‌ను కూడా సభ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈసారి ప్రజాకర్షక బడ్జెట్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితుల్లో సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభ ఆమోదం కోసం ఉంచే పద్దు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, కొత్త పథకాలు ఏముంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నేడు అసెంబ్లీలో బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ 2022–23 ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు హరీశ్‌రావు సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయల్దేరి ఫిల్మ్‌నగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేయనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment