సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మే 8 వతేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 1న ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా, కర్ఫ్యూను ఎందుకు పొడిగించలేదని శుక్రవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరో వారం రోజులపాటు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నైట్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ హోంశాఖ తరఫున మరో ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు. కర్ఫ్యూ అమల్లో భాగంగా రాత్రి 8 గంటలకే అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేయాలని ఏప్రిల్ 20న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఔషధ దుకాణాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ– కామర్స్ ద్వారా వస్తువుల పంపిణీ, పెట్రోల్ పంపులు వంటి అత్యవసర సేవలతోపాటు మరి కొన్ని రకాల సేవలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment