Aarogyasri Covid Treatment: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో కరోనా రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా సర్కారు ఆస్పత్రులకు అందజేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నిటిలో ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం భావించింది. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. దీంతో ఆరోగ్యశ్రీ అంటేనే పేదవారికి కార్పొరేట్ వైద్యమని, అలాంటిది ప్రైవేటులో చికిత్స చేయనిపక్షంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రయోజనమేమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు, ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు కవరేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇలావుండగా స్వైన్‌ఫ్లూను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్యాకేజీల వారీగా వైద్యం
కరోనాతో వచ్చే పలురకాల వ్యాధులకు ప్యాకేజీల వారీగా చికిత్స అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందుతాయి. ఆ ప్రకారమే ఆస్పత్రులకు ప్యాకేజీలు అందజేస్తారు. వైరస్‌ల కారణంగా వచ్చే అన్నిరకాల జ్వరాలకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. అంటే తీవ్రమైన జ్వరాలు వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వాటికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కరోనాతో వచ్చే ఈ కింది వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స
- నిమోనియా
- అక్యూట్ ఫెబ్రిలి ఇల్‌నెస్ (జ్వరంతో కూడిన జబ్బు)
- నిర్ధారణ కాని జ్వరం (పైరిక్సియా ఆఫ్ అన్‌నోన్ ఆరిజిన్)
- అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా (నాన్ వెంటిలేటెడ్)
- అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా (వెంటిలేటెడ్)
- ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి (నాన్ వెంటిలేటెడ్)
- ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి (వెంటిలేటెడ్)
- తీవ్రమైన స్వైన్‌ఫ్లూ న్యుమోనియా
- స్వైన్‌ఫ్లూ తీవ్రమై పలు అవయవాలు వైఫల్యం చెందడం
- స్వైన్‌ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం జరగడం
- శ్వాసనాళాల ఇన్‌ఫెక్షన్ (వెంటిలేటెడ్)
- శ్వాసనాళాల్లో ఏర్పడ్డ తీవ్రమైన నిమ్ము (వెంటిలేటెడ్)
- స్వైన్‌ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం,నిమ్ము ఏర్పడటం
- ఊపిరితిత్తుల్లో శ్వాసకోశాలు చిట్లిపోవడం
- నిమోకోనియోసిస్
తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు 949 వ్యాధులకు చికిత్స అందుతోంది. తాజాగా కరోనా సంబంధిత వ్యాధులను, స్వైన్‌ఫ్లూను ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.10 లక్షల మంది కార్డుదారులు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులుగా ఉన్నారు. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ పథకం కింద కరోనా చికిత్స అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment