New Airports In Telangana: Govt Planning To Built Six Airports - Sakshi
Sakshi News home page

గగనయానం దిశగా తెలంగాణ

Published Thu, Jun 24 2021 3:35 AM | Last Updated on Thu, Jun 24 2021 10:25 AM

Telangana Government Planning Built Six New Airports - Sakshi

  • రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాల పరిశీలనలో భాగంగా, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుబంధ సాంకేతిక విభాగం బృందాలు పలు దఫాలుగా ఆయా ప్రాంతాలు సందర్శించి సానుకూల నివేదికను అందించాయి.
  • ఏడాదిగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలను తేల్చేందుకు చేస్తున్న కరసత్తును కొలిక్కి తెచ్చిన సాంకేతిక విభాగం.. ఈ మేరకు నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.


సర్కారుపై భారమే..
చిన్న పట్టణాల ప్రజలకు విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఉడాన్‌ పథకాన్ని తెరపైకి తెచ్చింది. తొలుత కొన్ని పట్టణాలలో నిర్మించే విమానాశ్రయాల ఖర్చులో కొంత భరించేందుకు కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం భారీ వ్యయమే కానుంది. ఇక భూసేకరణకు అంతకంటే ఎక్కువ ఖర్చు కానుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఎయిర్‌పోర్ట్స్‌ అథా రిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ).. టెక్నో ఎకనమిక్‌ ఫీజబిలిటీ రిపోర్టులో భాగంగా, తాజాగా విమానాశ్రయాలకు కావాల్సిన భూమి, అంచనా వ్యయంతో కూడిన తుది నివేదికను ఖరారు చేసింది. రెండురోజుల క్రితం ఆ వివరాలను తెలం గాణ ప్రభుత్వాని కి అందజేసింది. ఈ ఆరు విమానాశ్రయాల ఏర్పా టు సాధ్యమేనని సంస్థ టెక్నికల్‌ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించగా, తాజా నివేదిక నేపథ్యంలో.. తుది అనుమతులకు సంబంధిం చిన సర్వే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నివేదిక ఆధారంగా చేయాల్సిన ఖర్చు, సమీకరించాల్సిన భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని పౌర విమానయాన శాఖకు అంగీకారం తెలిపితే, తుది అనుమతులకు సంబంధించిన సర్వే పనులు మొదలవుతాయి. ప్రతిపాదిత విమానాశ్రయాల్లో వేటికి తుది అనుమతులు ఇవ్వాలన్న విషయం ఆ సర్వేతో ఖరారవుతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. 

ఎక్కడెక్కడ?
నిజాం హయాంలో సేవలందించిన వరంగల్‌ శివారులోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని దాదాపు 15 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు ఆ విమానాశ్రయంతో పాటు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. మామునూరుతో పాటు ఆదిలాబాద్‌లో, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించాలని, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీ సేవలు అందించాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కోరగా అంగీకరించింది. ఈ మేరకు సానుకూల నివేదిక ఇచ్చిన సంస్థ సాంకేతిక విభాగం.. తాజాగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలతో నివేదికను రాష్ట్రానికి అందించింది.

ఫేజ్‌–1,  2
నివేదికలో ఫేజ్‌–1, ఫేజ్‌–2 పేరుతో సంస్థ వివరాలు పొందుపరిచింది. 40–50 సీట్ల సామర్ధ్యం ఉండే చిన్న విమానాల కోసం ఫేజ్‌–1 ప్రణాళిక రూపొందించింది. ఇవి పూర్తిగా డొమెస్టిక్‌ (దేశీయ) విమానాశ్రయాలుగా మాత్రమే ఉంటాయి. ఇతర వసతులు కూడా సాధారణంగా ఉంటాయి. వీటి వ్యయం కొంత తక్కువగా ఉంటుంది. భూమి అవసరం కూడా కొంత తక్కువే. ఇక అంతర్జాతీయ విమానాలు, బోయింగ్‌ విమానాల కోసం అదనపు హంగులతో నిర్మించే విమానాశ్రయాల కోసం ఫేజ్‌–2 ప్రణాళిక రూపొందించింది. వీటి వ్యయం కాస్త ఎక్కువ. భూమి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఖర్చు తగ్గింపుపై త్వరలో భేటీ
ఇంత భారాన్ని భరించటం కష్టమైన విషయమే కావటంతో ఖర్చును ఎంతమేర తగ్గించాలనే విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. విమానాశ్రయానికి కావాల్సిన వసతులు, భద్రత ప్రమాణాల ప్రకారం అంచనా వ్యయం రూపొందుతుంది. ఇందులో భద్రత ప్రమాణాలకు చేయాల్సిన ఖర్చు విషయంలో రాజీ ఉండదు. వసతుల పరంగా అయ్యే వ్యయంలోనే కొంత కోతపెట్టి ఖర్చును తగ్గించవచ్చు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎక్కువ భూమిని సేకరించటం సహజం. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించటం ద్వారా భూసేకరణ వ్యయాన్ని కొంత అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. ఇక వరంగల్‌ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అక్కడ ఫేజ్‌–2 ప్రకారం విమానాశ్రయాన్ని నిర్మించి, మిగతా చోట్ల ఫేజ్‌–1 ప్రమాణాల ప్రకారం తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంది. అలాగే ఒకేసారి ఆరుచోట్ల కాకుండా తొలుత ఒకటి, రెండు చేపట్టి.. మిగతావి దశలవారీగా చేపట్టే అవకాశం కూడా ఉంది. విమానాశ్రయానికి 150 కి.మీ. లోపు మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే ఒప్పందం జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉంది. అందువల్ల మమహబూబ్‌నగర్‌ విమానాశ్రయం విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై జీఎంఆర్‌ సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
  

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement