సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఈ ఏడాది మార్చిలో జరిగే ‘వింగ్స్ ఇండియా–2020’ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. భారతీయ పౌర విమానయాన పరిశ్రమకు తలమాణికంగా భావించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ‘వింగ్స్ ఇండియా 2020’లో భాగంగా అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సులుంటాయి.
‘ఫ్లైయింగ్ ఫర్ ఆల్’నినాదంతో జరిగే ‘వింగ్స్ ఇండియా’ద్వారా రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి అవసరమైన వాతావరణం వృద్ధి చెందగా.. ఎయిరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు బోయింగ్, జీఈ, రాఫెల్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు సుమారు వేయి చిన్న, మధ్య తరహా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలు, నాలుగు ఏరోస్పేస్ పార్కులున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్‌లు రాష్ట్రంలో ఉండటంతో భవిష్యత్‌లో ఏరోస్సేస్, డిఫెన్స్ రంగాల వృద్ధికి మరింత అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఏరోస్పేస్ శిక్షణపైనా దృష్టి
ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు శిక్షణ రంగంపైనా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఇప్పటికే బోయింగ్, ఫ్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏరోస్పేస్ వంటి స్టార్టప్ సంస్థలతో నూతన ఆవిష్కరణల కోసం ‘టీ హబ్’పనిచేస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ‘టీ వర్క్స్’ద్వారా కూడా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరఫున శిక్షణ ఇస్తుండగా, ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా ఈ రంగాలకు చెందిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీని రూపొందించిన రాష్ట్రం.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక పాలసీ తయారు చేయాలనే యోచనలో ఉంది.
పారిశ్రామికవాడల్లో హెలిపోర్టులు..
దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేళ్లలో వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి (నిజామాబాద్), బసంత్‌నగర్ (పెద్దపల్లి), అడ్డాకుల (మహబూబ్‌నగర్)లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిం ది. ఈ 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తోంది.
హైదరాబాద్ బయట వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్లతో పాటు, ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామికవాడల్లో హెలిపోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ హెలీపోర్టుల ద్వారా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభిస్తుందనే అంచనా వేస్తోంది. వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
ఏరోస్పేస్‌కు కొత్త రెక్కలు
Published Thu, Feb 6 2020 3:12 AM | Last Updated on Thu, Feb 6 2020 3:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment