
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనడానికి తొలి దశలో రూ. 9.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గడువు నాటికి అవసరమైన పరికరాల కొనుగోలుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ రూపొందిస్తున్నది. పల్లెల్లో ప్రతీ ఇంటికీ తిరుగుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఈసీజీ వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని అందజేస్తారు.
ఈ ఐడీ ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వారి ఆరోగ్య చరిత్రను ఆన్‌లైన్‌లో డాక్టర్లు చూడడానికి వీలుపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment