
అమిత్‌షాకు జ్ఞాపికను అందజేస్తున్న తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తమిళిసై సాయంత్రం 5 గంటలకు అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ఆమె అమిత్ షాకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనా విధానంసహా పలు రాజకీయ అంశాలపై అమిత్ షా ఆరా తీశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించినట్లు తమిళిసై ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment