సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను తెలంగాణలోనే ఉంచాలని ప్రభుత్వం హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీనికి ఏపీ కూడా అభ్యంతరం లేదని తెలిపిందని వెల్లడించింది. 2014 రాష్ట్ర విభజన సమ యంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించి ఉపశమనం పొందారు.
ఈ క్రమంలో ఏపీకి కేటాయించిన సోమేశ్‌కుమార్ కూడా తెలంగాణలోనే విధులు నిర్వహిస్తు న్నారు. అధికారుల విభజనకు వ్యతిరేకంగా వీరు క్యాట్ నుంచి ఉత్తర్వులు పొందడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదంది.
క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
ఎవరికీ ఏ సమస్యా లేదు...
‘సోమేశ్‌కుమార్ తెలంగాణలో ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. కేంద్రం కూడా వారి వాదనకు కారణాలను చూపడం లేదు. ప్రత్యూష్ సిన్హా కమిటీ రూపొందించిన మార్గ దర్శకాలు ఆమోదయోగ్యంగా లేవు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన పీకే మహంతి పక్షపాతంతో వ్యవహరించారు.
తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూర్చేలా ఆయన వ్యవహరించారు. అంతేగాక, రాష్ట్ర విభజనకు ముందే 2014 ఫిబ్రవరి 28న మహంతి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు మాసాలు ఆయన సర్వీసును పొడిగించింది. జూన్ 30 వరకు సర్వీస్ ఉండగా, 2014 జూన్ 1న అంటే రాష్ట్ర విభజనకు ఒక్క రోజు ముందు మహంతి తన రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే, సోమేశ్‌కుమార్ ఫిర్యాదుకు కేంద్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. కేంద్రం వేసిన పిటిషన్‌కు విచారణ అర్హతలేదు’అని ఏజీ నివేదించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment