ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులకు విడిగా వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న మహిళా టీచర్లు, ఉద్యోగులు
నా పేరు వి.శ్రీనిత. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. మేము దుండిగల్‌లో ఉంటాం. మా మమ్మీ అర్చన దుండిగల్‌లోని ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేసేది. మా డాడీ పేరు కేశవనారాయణ మేడ్చల్ జిల్లా మల్లంపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ 317 జీఓ వల్ల మా మమ్మీ మాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కుల్‌కుల్ ఉన్నత పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయింది.
అప్పటి నుంచి మాకు పెద్ద కష్టమొచ్చింది. నేను లేవకముందే మమ్మీ వెళ్తుంది. రాత్రి పడుకున్నాక వస్తుంది. సెలవు రోజుల్లోనే మా మమ్మీని చూస్తున్నా.. జడ వేయడానికి టైమ్ ఉండటం లేదని జుట్టు కట్ చేయించింది. కేసీఆర్ తాతా... మా మమ్మీ, డాడీని ఒకే జిల్లాలో పనిచేసేలా చూడు ప్లీజ్. లాంగ్ జర్నీ వల్ల మా మమ్మీ హెల్త్ దెబ్బతింటుంది. ప్లీజ్ కన్సిడర్..
గజ్వేల్: 317 జీఓ కారణంగా వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన ఎంతో మంది ఉద్యోగ, ఉపాధాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేకాక, వారి పిల్లల కష్టాలకు శ్రీనిత వేడుకోలు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం జరిగిన స్పౌజ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సభ ఆద్యంతం ఉద్విగ్నం, ఉద్వేగ పరిస్థితుల మధ్య సాగింది.
తమ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో గజ్వేల్‌ను వేదికగా చేసుకొని కేసీఆర్ ఫొటోను బ్యానర్‌గా పెట్టుకొని మరీ ఈ సభను ఏర్పాటు చేశారు. స్పౌజ్ బదిలీలను ప్రభుత్వం బ్లాక్ చేసిన సిద్దిపేటతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల, హనుమకొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ సభ నిర్వహించారు.
సభలో పలువురు మహిళా టీచర్లు, ఉద్యోగులు మాట్లాడుతూ 317 జీఓ వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యామని, సీఎం కేసీఆర్.. ఖాళీలున్న జిల్లాల్లో వెంటనే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని ఆదేశించినా, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని, అందువల్ల తాము కుటుంబాలకు దూరమవుతున్నామని కంటతడి పెట్టుకున్నారు. బాధితుల సంఘం అధ్యక్షుడు వివేక్, ప్రధాన కార్యదర్శి నరేశ్‌లు మాట్లాడుతూ 317 జీఓ వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన వారిని తమ సొంత జిల్లాలకు కేటాయించాలని సీఎం ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడం వల్ల దాదాపు 2,300 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు వాపోయారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో పనిచేయాల్సి రావడం వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సభలో స్పౌజ్ బాధితుల సంఘం సభ్యులు ఎ.మల్లికార్జున్, ఖాదర్, త్రివేణి, అర్చన, గడ్డం కృష్ణ, బాలస్వామి, మహేశ్, ప్రవీణ్, చంద్రశేఖర్, దామోదర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment