సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని పరిశీలిస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి–మహబూబ్‌నగర్– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను సరూర్‌నగర్‌లోని ఇండోర్‌స్టేడియంలో లెక్కించనున్నారు. భారీ సంఖ్యలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే కాక, గతంలో కంటే ఓటర్లు..పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగినందున కౌంటింగ్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఎన్నికలో పోస్టల్‌బ్యాలెట్ల ఓట్లను విడిగా లెక్కించరని అధికారులు తెలిపారు.
గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 8400 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మూడింతలు పెరిగింది. ఓటర్లు భారీగా పెరిగారు. అప్పట్లో 2.96 లక్షల ఓటర్లుండగా, ప్రస్తుతం 5.31 లక్షలకు పెరిగారు. గత ఎన్నికల్లో 39 శాతం పోలింగ్ జరగ్గా, ప్రస్తుతం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. అంటే, పోలింగ్ శాతం దాదాపుగా డబుల్ అయింది. ప్రాధాన్యతలతో ఓట్లను సక్రమంగా వేయలేకపోయిన ఓటర్లు ఎక్కువ మంది ఉండవచ్చుననే అనుమానాలున్నాయి. అదే జరిగితే చెల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ మంది బరిలో ఉన్నందున అభ్యర్థులందరి ఓట్లూ లెక్కించేందుకు ఎంతో సమయం పట్టనుంది.
బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ, బ్యాలెట్ పేపర్లను నిర్ణీత సంఖ్యలో బండిల్స్‌గా కట్టడం, ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తిచేయాల్సి ఉండటంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం అసలైన లెక్కింపు ప్రారంభం కానుంది. బుధవారం విజేత ఎవరో తెలిసే అవకాశాల్లేవని అధికారులు భావిస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు..
అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎనిమిది హాళ్లలో, ఒక్కో హాల్‌లో ఏడు టేబుళ్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలుత బ్యాలెట్ పత్రాలను 50 లేదా 100 బ్యాలెట్లను కలిపి ఒక్కొక్క బండిల్‌గా కడతారని, తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
దిల్‌సుఖ్‌నగర్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం లెక్కింపు కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. ఇండోర్ స్టేడియం వద్ద మూడంచెల భద్రత, 1200 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. స్టేడియం చూట్టూ మౌంటెడ్ గుర్రాలు, పెట్రోలింగ్, సీసీటీవీలు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment