సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్తగా పన్నులు వేసే ఆలోచన లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సూచనలు చేస్తోందని చెప్పారు. జూన్ నాటికి రూ.20 వేల కోట్లను సమకూర్చుకోనున్నామని, నిరర్ధక ఆస్తులను వనరులుగా మార్చుకుంటున్నామని తెలిపారు. కే వలం భూములను అమ్మడం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నామనడం సరికాదన్నారు. బుధవారం బడ్జెట్‌పై సాధారణ చర్చ అనంతరం కాంగ్రెస్ సభా పక్షనేత భట్టి విక్రమార్క అడిగిన క్లారిఫికేషన్స్‌కు ఆయన సమాధానమిచ్చారు.
పాత్రికేయులకు వెంటనే స్థలాలివ్వండి: భట్టి
లిక్కర్, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని బడ్జెట్‌లో భారీగా చూపటం అనైతికమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వచ్చే విదేశీయులకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు వెళ్తే మాత్రం ఎందుకు అరెస్టు చేస్తోందని నిలదీశారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత పాత్రికేయులకు వెంటనే ఆ స్థలాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి నాలుగైదు గంటలు కూడా కరెంటు సరఫరా కావటం లేదని సభ దృష్టికి తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో చెరువు నీటిని తాగినందుకు ఓ మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించేందుకు ఆయన ప్రయత్నించగా, ముందస్తు అనుమతి తీసుకోనందున అనుమతించలేమని స్పీకర్ చెప్పారు.
డబుల్ బెడ్రూం ఇళ్లపై..
బడ్జెట్‌లో నిరుద్యోగుల భృతి, స్పోర్ట్స్ పాలసీ, డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తావన లేదని బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రస్తావించగా.. క్రీడా విధానంపై మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రకటన చేస్తారని, డబుల్ బెడ్రూం ఇళ్లను హడ్కో నుంచి తెచ్చే రుణం ద్వారా పూర్తి చేస్తామని హరీశ్‌రావు బదులిచ్చారు. ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు, మూడు పెండింగ్ డీఏలను చెల్లించటంతోపాటు తక్షణమే కొత్త పీఆర్‌సీ కమిటీ వేయాలని, సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment