సాక్షి, హైదరాబాద్: రోహింగ్యాలను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు వెంటనే వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విదేశీయుల చట్టంలోని 3(2)(జీ) ప్రకారం రాష్ట్రాలకు ఆ అధికారం లేదని పేర్కొంది. అధికారులు జారీ చేసిన 541, 538, 593, 540, జీవోలను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. చర్లపల్లి జైలులో ఉన్న రెహముల్లా, జాఫర్ ఆలమ్ అలియాస్ మహమద్ సాజిద్, అబ్దుల్ అజీజ్, నూర్ కాసీం అలియాస్ మహ్మద్ నూర్, నాజర్ ఉల్ ఇస్లామ్‌లను విడుదల చేయాలని సూచించింది.
ఈ మేరకు రాష్ట్రంలో వారిని నిర్బంధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లో తీర్పు ఇచ్చింది. కిందికోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ ఐదుగురిని నిర్బంధంలోనే ఉంచాలని డీజీపీ వినతి మేరకు ప్రభుత్వం వేర్వేరుగా 541, 538, 593, 540 జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో మొత్తం ఐదు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఉత్తర్వులు వెలువరించింది. అంతకుముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విదేశీయులను అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎంఏ షకీల్ వాదించారు. ఎక్కడున్నా ఓ నిర్ధిష్ట ప్రదేశంలోనే రోహింగ్యాలు ఉండేలా నియంత్రణ చేయవచ్చు.. కానీ, జైల్లో పెట్టడానికి వీల్లేదని నివేదించారు.
ఒకవేళ వారిపై ఏమైనా కేసులు ఉంటే చట్ట ప్రకారం విచారణ చేయవచ్చని తెలిపారు. శ్రీలంక నుంచి అక్రమంగా వచ్చిన వారి విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్ధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక నిర్బంధ కేంద్రాలు లేనందున రోహింగ్యాలను విచారణ ఖైదీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జైళ్లల్లో ఉంచుతున్నామని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్ కుమార్ వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment