వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ. చిత్రంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిన్ నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రశంసించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో కోర్టులు, న్యాయాధికారులు, ఇతర సిబ్బంది నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కోర్టుల్లో అవసరమైన సదుపాయాలు కూడా కల్పించింది. దీనికి జస్టిస్ నాగార్జున ఎంతగానో కృషి చేశారు.
కరోనా సమయంలో పెండింగ్ కేసుల భారం తగ్గించేందుకు అందరూ సహకరించారు. జాగ్రత్తల నడుమ ప్రత్యక్ష కోర్టులు నిర్వహించాం. 2021లో నేను సీజేగా వచ్చాక.. సీజేఐ కృషి ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగింది. కొత్త న్యాయమూర్తుల నియామకం చేపట్టడం జరిగింది’ అని సీజే వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
డిటెక్టివ్‌లా.. రైతులా.. వైద్యుడిలా..: ‘అన్వేషణ చేసే డిటెక్టివ్‌లా.. ఎన్ని కష్టాలొచ్చినా సాగు చేసే రైతులా.. శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా.. న్యాయవాదులు పనిచేయాలి. పేద ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేయాలి. జూనియర్ న్యాయవాదులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి. నైతిక విలువలు నేర్చుకోవాలి’ అని సీజే సూచించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ‘ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నా.. అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వస్తా. ఈ నగరంతో బంధం విడదీయరానిది’ అని సీజే పేర్కొన్నారు.
సీజేలో మానవత్వం ఎక్కువ: అందరికీ నవ్వుతూ కనిపించే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, విధి నిర్వహణలో చాలా సీరియస్‌గా పనిచేస్తారని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. ఆయనలో మానవత్వం కూడా ఎక్కువేనని అది పలు కేసుల విచారణలో చూపించారన్నారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలబడే తీర్పులు సీజే ఇచ్చారన్నారు. మూడున్నర వేల కేసుల్ని పరిష్కరించారని కొనియాడారు.
కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం రాత్రి సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మకు వీడ్కోలు విందు ఇచ్చారు. మరోవైపు జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ బదిలీ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment