justice satish chandra sharma
-
ప్రభుత్వ ప్రోత్సాహం ప్రశంసనీయం: హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ
సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రశంసించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో కోర్టులు, న్యాయాధికారులు, ఇతర సిబ్బంది నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కోర్టుల్లో అవసరమైన సదుపాయాలు కూడా కల్పించింది. దీనికి జస్టిస్ నాగార్జున ఎంతగానో కృషి చేశారు. కరోనా సమయంలో పెండింగ్ కేసుల భారం తగ్గించేందుకు అందరూ సహకరించారు. జాగ్రత్తల నడుమ ప్రత్యక్ష కోర్టులు నిర్వహించాం. 2021లో నేను సీజేగా వచ్చాక.. సీజేఐ కృషి ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగింది. కొత్త న్యాయమూర్తుల నియామకం చేపట్టడం జరిగింది’ అని సీజే వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిటెక్టివ్‌లా.. రైతులా.. వైద్యుడిలా..: ‘అన్వేషణ చేసే డిటెక్టివ్‌లా.. ఎన్ని కష్టాలొచ్చినా సాగు చేసే రైతులా.. శస్త్రచికిత్స చేసే వైద్యుడిలా.. న్యాయవాదులు పనిచేయాలి. పేద ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేయాలి. జూనియర్ న్యాయవాదులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి. నైతిక విలువలు నేర్చుకోవాలి’ అని సీజే సూచించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ‘ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నా.. అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వస్తా. ఈ నగరంతో బంధం విడదీయరానిది’ అని సీజే పేర్కొన్నారు. సీజేలో మానవత్వం ఎక్కువ: అందరికీ నవ్వుతూ కనిపించే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, విధి నిర్వహణలో చాలా సీరియస్‌గా పనిచేస్తారని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. ఆయనలో మానవత్వం కూడా ఎక్కువేనని అది పలు కేసుల విచారణలో చూపించారన్నారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు అండగా నిలబడే తీర్పులు సీజే ఇచ్చారన్నారు. మూడున్నర వేల కేసుల్ని పరిష్కరించారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం రాత్రి సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మకు వీడ్కోలు విందు ఇచ్చారు. మరోవైపు జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ బదిలీ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈమేరకు న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. -
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న ఉన్న సతీష్ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది. ►ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి ►హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అంజాద్ సయీద్ ►రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే ►గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ చదవండి: (AP: రాజ్యసభ అభ్యర్ధులపై కొనసాగుతున్న కసరత్తు) -
ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్ గౌడ్ ప్రసంగించారు. -
పోక్సో కోర్టులతో సత్వర న్యాయం
మహబూబాబాద్ రూరల్/జనగామ: జిల్లాల్లో పోక్సో కోర్టుల ఏర్పాటు ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ అన్నారు. మహబూబాబాద్, జనగామలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టులను సోమవారం ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు, వరంగల్ నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు పాల్గొన్నారు. మహబూబాబాద్ గిరిజన జిల్లాలో ఇలాంటి కోర్టు అత్యవసరమన్నారు. పునర్విభజనలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి కోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక, జడ్జి అనిల్ కిరణ్‌కుమార్, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు. -
మూసీపై హైకోర్టు సీజే వ్యాఖ్యలు.. ప్రక్షాళన ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీ జీవనాడి చారిత్రక మూసీ నదికి లండన్‌లోని థేమ్స్.. గుజరాత్‌లోని సబర్మతి తరహాలో మహర్దశ ఎప్పుడు పడుతుందా అని మహానగర సిటీజన్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హైకోర్టు సమీపంలో మూసీ నది మురుగు కాల్వను తలపిస్తోందని వ్యాఖ్యానించడంతో ఈ నది ప్రక్షాళన, సుందరీకరణ అంశం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ►మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా.. నగరంలో మూసీ ప్రవహిస్తోన్న 45 కి.మీ మార్గంలో (బాపూఘాట్– ప్రతాప సింగారం)ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, ప్రవాహ మార్గానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవడం, డ్రోన్లతో దోమల ఉద్ధృతి పెరగకుండా స్ప్రే చేయడం, పలు చోట్ల తీరైన నడకదారులు, హరిత వాతావరణం ఏర్పాటు చేయడం వంటి ఉపశమన చర్యలు తీసుకోవడం విశేషం. ►మరోవైపు ఇటీవలి కుండపోత వర్షాలకు నదిలో మురికి పైపైన కొట్టుకుపోయింది. మూసీ నీటిలో వృక్ష,జంతు ఫ్లవకాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ శాతం పెరగడం కూడా పెద్ద ఊరట. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనని శాశ్వత పరిష్కార చర్యలు కావని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. ►మూసీ ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్‌ప్లాన్ తయారు చేసి అమలు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రణాళికల అమలుపై మూసీ కార్పొరేషన్, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. సమగ్ర మాస్టర్‌ప్లాన్ అత్యవసరం.. ►మహానగరానికి మణిహారంలా ఉన్న చారిత్రక మూసీనది ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ఈ నదిలో చేరకుండా ఇది ప్రవహించే మార్గానికి ఇరువైపులా రూ.3,865 కోట్ల అంచనా వ్యయంతో దశలవారీగా 31 ఎస్టీపీలను నూతనంగా నిర్మించాల్సి ఉంది. ►ఆయా పనులకోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు జారీచేసింది. పనులు తక్షణం ప్రారంభించి ఏడాదిలోగా ఈపనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇక సిటీలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్– ప్రతాపసింగారం వరకు చేపట్టాల్సిన సుందరీకరణ పనులతోపాటు తీరైన రహదారులు, ఫ్లైఓవర్లు, నడకదారుల ఏర్పాటు, బోటింగ్ సదుపాయం కల్పించడం తదితర పనులపై సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూ.30 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలోనే మహర్దశ మూసీకి మహార్ధశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. త్వరలో సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేసి దాని ప్రకారం పనులు చేపడతాము. ఇటీవలి కాలంలో రూ.7 కోట్ల అంచనా వ్యయంతో మూసీ ప్రవాహ మార్గంలో తీరైన నడకదారులను అభివృద్ధి చేశాము. మూసీ ప్రవహించే మార్గాన్ని సమగ్ర సర్వే చేపట్టి...నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాము. – సుధీర్‌రెడ్డి, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -
సీజేగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన వారెంట్‌ను తమిళిసై జస్టిస్ శర్మకు అందించారు. ఈ సందర్భంగా తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అమర్నాథ్ గౌడ్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలి, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ భూపాల్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాసగౌడ్, ఎంపీలు కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు వికాస్‌రాజ్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీజేగా విధులు నిర్వర్తించిన జస్టిస్ హిమాకోహ్లీకి ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శర్మకు సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన తర్వాత మొదటి సీజేగా జస్టిస్ తొట్టతిలి బి.నాయర్ రాధాకృష్ణన్ సేవలందించగా తర్వాత జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ సేవలందించారు. నాలుగో సీజేగా జస్టిస్ శర్మ బాధ్యతలు చేపట్టారు. సీజేను కలిసిన న్యాయవాదుల సంఘం ప్రతినిధులు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం జస్టిస్ శర్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. సీజేను కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కల్యాణ్‌రావు, న్యాయవాదులు డీఎల్ పాండు, ఐ.రమేష్, మంగులాల్, రాము, అజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ బదిలీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నా«థ్ గౌడ్‌ను త్రిపుర హైకోర్టు బదిలీ చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. సెప్టెంబరు మూడో వారంలో ఏడు హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. సోమవారం ఆయా బదిలీలను కేంద్రం నోటిఫై చేసింది. -
తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ సోమవారం ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ... తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్పూర్లోని సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే వర్సిటీలో న్యాయ పట్టా అందుకొని 1984, సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ బార్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఎల్‌ఎల్‌బీలోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ విషయాల్లో ప్రాక్టీస్ చేశారు. 1993లో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.