
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో(సీహెచ్‌సీ) నిర్వహించిన వైద్య శిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనలో కేంద్రం ఇన్‌చార్జీ డాక్టర్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ఆదేశించింది. నలుగురు మహిళల మృతికి కారకులుగా పేర్కొంటూ పలువురిని వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేసింది.
వీరిలో ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి తాజాగా విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలోని సీహెచ్‌సీలో పలువురికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని.. అయితే, ఆ రోజున పిటిషనర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు.
దీనికి సంబంధించిన ఐడీకార్డును, ఫొటోలను కోర్టుకు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని వివరించారు. సస్పెండ్ చేయడం శిక్షేమీ కాదని, నలుగురు మృతికి ఎవరు కారణమో జరిగే విచారణ పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్‌లో పెట్టడం తప్పుకాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment