సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత విచారణ సందర్భంగా విధించిన షరతులు పాటించాలని ఆదేశించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు స్పష్టం చేసింది. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత నెల వరంగల్‌లో షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించి.. అనుమతి పొందారు. ఆ తర్వాత కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌టీపీ సభ్యుడు డి.రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున జీవీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో 3,500 కి.మీ. మేర షర్మిల పాదయాత్ర ప్రశాంతంగా సాగిందన్నారు.
గత విచారణ సందర్భంగా తాము ఆదేశాలు ఇచ్చినా పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆయన బదులిస్తూ.. హైకోర్టు అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినా కూడా తెలంగాణను షర్మిల తాలిబన్ రాజ్యంతో పోల్చారన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని చెప్పారు. రాజకీయ నేతలకు పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందన్న న్యాయమూర్తి.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వాటిపై ఆంక్షలు విధించాల్సి వస్తుందన్నారు.
టీఆర్‌ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటం సరికాదని జీపీకి సూచించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. అసలు రాజకీయ నాయకులంతా పాదయాత్ర కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. అనంతరం యాత్రకు అనుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పైనా, రాజకీయంగా, మతపరంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. ఇతర నాయకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment