సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం ఫతేనగర్ సర్వే నంబర్ 78, 79లోని దాదాపు 11.5 ఎకరాల (46,538 చదరపు మీటర్లు) భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో గతేడాది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దీంతో వందలకోట్ల విలువైన భూమి సర్కార్‌కే దక్కింది. వివరాలు... ఈసీఈ ఇండస్ట్రీస్ అక్కడ ఫ్యాక్టరీ నిర్మించడంతో ప్రభుత్వం 1982లో సర్వే నంబర్ 78, 79లోని కొంతభూమికి మినహాయింపు ఇచ్చింది.
తర్వాత అధికారులు లెక్కలు వేసి, ఈసీఈ ఇండస్ట్రీస్ వద్ద సర్వే నంబర్ 74/పీ, 75/పీ, 76/పీలో 11.5 ఎకరాల మిగులు భూమి ఉన్నట్లు నిర్ధారించారు. ఆ భూమిని అర్బన్ సీలింగ్ ల్యాండ్(యూఎల్‌సీ)గా ప్రకటించి వెనక్కు తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈసీఈ ఇండస్ట్రీస్ 2009, 2010లో హైకోర్టు లో రెండు పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు.
అది యూఎల్‌సీ అని బాలానగర్ తహసీల్దార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు 1965 నుంచి తమకు సేల్‌డీడ్ ఉందని ఈసీఈ ఇండస్ట్రీస్ పేర్కొంది. వాదనలు విన్న న్యాయమూర్తి రిట్ పిటిషన్లను అనుమతిస్తూ 2022లో ఉత్తర్వులు జారీచేశారు. యూఎల్‌సీ చట్టాన్ని రద్దు చేసే నాటికి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, చట్టప్రకారం జారీ చేసిన నోటీసులు పాతవేనన్నారు. చట్టాన్ని రద్దు చేసిన తర్వాత అధికారులు కార్యాలయంలో పంచనామా చేశారన్నారు. ఇప్పటికీ భూమి ఈసీఈ ఇండస్ట్రీస్ అధీనంలోనే ఉన్నందున వారికే చెందుతుందని పేర్కొన్నారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల సవాల్
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. వాదనల అనంతరం తీర్పునిస్తూ సింగిల్‌జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా పాత తేదీతో నోటీసులిచ్చారని సింగిల్‌జడ్జి పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని సమర్థించింది. పంచనామా నిర్వహించి భూములను స్వాధీనం చేసుకోవడం చట్టపరమైన అంశమేనని, దీన్ని ఆమోదించాల్సిందేనని పేర్కొంది. 2008లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment