సాక్షి, హైదరాబాద్: కనిపించిన నిధినల్లా వాడేసుకుని, తిరిగి చెల్లించకుండా భారీగా బకాయిపడ్డ ఆర్టీసికి ఇప్పుడు చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులతో కూడిన సహకార పరపతి సంఘం.. ఆ సంస్థపై ఫిర్యాదు చేస్తూ హైకోర్టు తలుపు తట్టనుంది. సంఘానికి బకాయిపడ్డ రూ.850 కోట్ల మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ లీగల్ నోటీసు జారీ చేసింది.
ఒకప్పుడు సంస్థ ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచి ఎంతగానో పేరొందిన ఈ సంఘం, ఆర్టీసీ మొండివైఖరి కారణంగా మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని నోటీసులో పేర్కొంది. దాన్ని నమ్ముకున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని చెప్పింది. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆ సంఘం కార్యదర్శి మహేశ్ పేరుతో హైకోర్టు న్యాయవాది లీగల్ నోటీసు జారీ చేశారు. గతంలోనే ఓసారి హైకోర్టు జోక్యం చేసుకుని, సహకార పరపతి సంఘానికి బకాయిలు చెల్లించాలని సూచించింది. ఇప్పుడు కోర్టు ఆదేశాన్ని ధిక్కరించినందుకూ ఆర్టీసీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ కథ..
ఆర్టీసీ ఉద్యోగులు సభ్యులుగా ఉండే ఈ సహకార పరపతి సంఘం 1952లో ఏర్పాటైంది. ఉద్యోగుల జీతం నుంచి 7 శాతం మినహాయించగా గతంలో నెలకు రూ.40 కోట్ల వరకు నిధి ఉండేది. ప్రస్తుతం అది రూ.22 కోట్లుగా ఉంది. ఈ మొత్తం నుంచి ఉద్యోగుల అవసరాలకు రుణం అందిస్తారు. మిగతా మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. కొన్నేళ్లుగా ఈ నిధిని ఆర్టీసీ తన అవసరాలకు వాడేసుకోవటం ప్రారంభించింది.
చెల్లింపులు చేయకుండా ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. సజ్జనార్ ఎండీగా వచ్చాక పలు దఫాలుగా రూ.500 కోట్లను బకాయి రూపంలో చెల్లించారు. ఇంకా రూ.610 కోట్ల బకాయి ఉంది. మరో రూ.240 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. క్రమంగా సభ్యత్వాన్ని రద్దు చేసుకుని తమ డిపాజిట్ మొత్తాలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేయటం ప్రారంభించారు. 10 వేల మంది అలా రద్దు చేసుకోగా, మరో 6 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ప్రస్తుతం రుణాలకు సంబంధించి మరో 7 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment