
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా ఎందుకు కూల్చట్లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న తీరు పై దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం మరో సారి విచారించింది.
నగరవ్యాప్తంగా 145 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. అయితే కూల్చివేత అంటే భవనాలకు రంధ్రాలు పెట్టడం కాదని, పూర్తిగా కూల్చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జీహెచ్‌ఎంసీలో ఉన్న సర్కిళ్లలో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఎన్ని భవనాలపై కేసులు నమోదు చేశారు? ఎంత మందికి నోటీసులు జారీ చేశారు.. తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టారా.. ఎన్ని కేసుల్లో కింది కోర్టులు కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయి? కూల్చివేతలపై స్టే ఎత్తివేతకు ఏం చర్యలు తీసుకున్నారు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు’ తదితర వివరాలను సర్కిళ్ల వారీగా సమర్పించాలని ధర్మాసనం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.
( చదవండి: ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! )