రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ..గేమ్‌ఛేంజర్‌కు ప్రత్యేక షోకుఎలా అనుమతి ఇస్తారంటూ అసహనం
ప్రత్యేక షోలు, టికెట్ల ధరల పెంపును పునఃసమీక్షించాలి
హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి న్యాయస్థానం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో కూడా వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేయాలనుకోవడం సరికాదని హితవు పలికింది. గేమ్‌ఛేంజర్ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దిల్‌రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక షోలకు, టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్‌తోపాటు సతీశ్‌కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరల పెంపు సినిమాటోగ్రఫీ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2021లో జారీ చేసిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పెంచిన టికెట్ ధరలు పూర్తికాలం కొనసాగవని, ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వెళ్లే సరికి ఎంత సమయం అవుతుందని జీపీని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా అని మరోసారి చెప్పారు. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను వాయిదా వేసింది
Comments
Please login to add a commentAdd a comment