నీటమునిగిన కొమురం భీం జిల్లా ఐనం గ్రామం
►కొమురం భీం జిల్లా జైనూర్‌లో 39.10 సెం.మీ. వాన కురిసింది. మొత్తంగా ఐదు చోట్ల 30 సెంటీమీటర్లకుపైగా, 28కిపైగా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకన్నా అధికంగా భారీ వర్షం నమోదైంది.
►ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి వెంట ఏజెన్సీలు నీటి ముంపుతో తల్లడిల్లుతున్నాయి. వేలమందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.
►వర్షాలతో స్తంభాలు కూలిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
►రాష్ట్రంలో సాధారణంగా జూన్ 13 నాటికి 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 48.54 సెంటీమీటర్ల వాన పడింది. బుధవారం ఒక్కరోజే 6.48సెం.మీ. వర్షం పడింది.
►మరో రెండు రోజులూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
►వర్షాలకు ఇళ్లు కూలడంతో ఇద్దరు, కాల్వలో కొట్టుకుపోయి ఒక యువకుడు మృతి చెందారు.
►కొమురం భీం జిల్లా బీబ్రాలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వెళ్లిన సింగరేణి రెస్క్యూ టీంలో ఇద్దరు పెద్దవాగు బ్యాక్ వాటర్‌లో గల్లంతయ్యారు.
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని జడి వాన ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటు 6.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురం భీం జిల్లా జైనూర్‌లో ఏకంగా 39.10 సెంటీమీటర్ల కుంభ వృష్టి కురిసింది. చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా భారీ వాన పడింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించడంతో.. వాగులు, వంకలు పోటెత్తాయి. చిన్న ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. పలుచోట్ల ప్రమాదకర స్థాయికి చేరాయి. వాగులు, ఉప నదుల నీటి చేరికతో గోదావరి ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెండింతలకుపైగా..
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే రెండింతలకుపైగా వానలు కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో సాధారణంగా జూన్ 13 (బుధవారం) నాటికి 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 48.54 సెంటీమీటర్ల వాన పడింది. ఇందులో బుధవారం ఒక్కరోజే 6.48 సెంటీమీటర్ల వర్షం పడటం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అతి ఎక్కువ వర్షం కురిసినట్టుగా రికార్డు నమోదైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ ఆగమాగం
భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పది కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో స్తంభాలు కూలిపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరి ఉప్పొంగడంతో మంచిర్యాల పట్టణంలోని రామ్‌నగర్, ఎన్టీఆర్ కాలనీలు జలమయం అయ్యాయి. జన్నారం, దండేపల్లి, చెన్నూరు మండలాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. పోలీసు, సింగరేణి రెస్క్యూ, మున్సిపల్ అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మన్నమడుగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరడంతో కేస్లాగూడ గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిర్మల్–మంచిర్యాల మార్గంలో 61 జాతీయ రహదారిపై అప్రోచ్ రోడ్లు తెగిపోయాయి. పలుచోట్ల చెట్లు పడిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో పలు ప్రాంతాలు నీటిలో చిక్కు కున్నాయి. బాధితులను తెప్పలపై సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. బాసర, లోకేశ్వరం, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్, సోన్ మండలాల్లోని పలు గ్రామాల్లోకి ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చొచ్చుకొచ్చింది.
ఏజెన్సీ గ్రామాలు జలమయం
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ నుంచి ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడి కొండాయి బ్రిడ్జి కుంగిపోయింది. గోగుపల్లి, కొండాయి, చెల్పాక తదితర పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కడెం వరద, భారీ వర్షానికి పలిమెల మండల కేంద్రంతోపాటు 8గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ వరద ముంపు పరిశీలించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు లెంకలగడ్డనే ముంపులో చిక్కుకున్నారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది పరీవాహక ప్రాంతాల నుంచి సుమారు 2,300 మందిని పునరావాస శిబిరాలకు
తరలించారు.
తీవ్ర అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 12 జిల్లాలు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
12 జిల్లాలకు రెడ్ అలర్ట్
కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment