మల్లన్నసాగర్ ప్రాజెక్టు
దుబ్బాక టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 9 జిల్లాల వర ప్రదాయిని, 15 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించనున్న ఈ రిజర్వాయర్‌ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
2018లో మొదలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి.
10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున 5 అంచెల్లో 557 మీటర్ల ఎత్తు వరకు కట్టారు. 143 మీటర్ల పొడవున మత్తడి ఏర్పాటు చేశారు. తుక్కాపూర్ వద్ద సొరంగ మార్గంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన పంపుహౌజ్ నుంచి బాహుబలి మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి నీటిని వదులుతారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌ల కోసం 30 టీఎంసీలు
మల్లన్నసాగర్‌తో సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, మేడ్చల్ జిల్లాల్లో కాళేశ్వరం 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.
మరో 7,37,250 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్సారెస్పీ–స్టేజీ 1, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15 లక్షల 71 వేల ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందకు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.
ప్రస్తుతం 10 టీఎంసీలు నిల్వ
అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడంతో రిజర్వాయర్‌ను ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నింపుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment