సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్పు తేవాలనే ఉన్నత లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పనిచేస్తోందని, దేశ రైతాంగం బాగుపడేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తోందని... కృష్ణా, గోదావరి నదులకు పుట్టినిల్లయిన మహారాష్ట్రలో ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ ‘మహారాష్ట్ర, తెలంగాణ వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తుండగా నదుల్లో సుమారు 70 వేల టీఎంసీల నీరు సాగు, తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 20 వేల టీఎంసీల నీటినే ఉపయోగించుకుంటున్నాం. చైనా, ఈజిప్ట్, అమెరికా, జింబాబ్వే వంటి దేశాలు భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మన దగ్గర సరైన ప్రణాళిక లేక కరువు ఎదుర్కొంటున్నాం. తెలంగాణలో సాధించిన జల దృశ్యాన్ని మహారాష్ట్రలోనూ సా«ధించేందుకు తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తూ 4–5 భారీ ప్రాజెక్టులు నిర్మిస్తాం’అని కేసీఆర్ ప్రకటించారు.
మార్పునకు మహారాష్ట్ర నాంది పలకాలి...
‘చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా అభివృద్ధి చెందుతున్నా మన నాయకులు ఓట్ల కోసమే పనిచేస్తున్నారు. దేశంలో మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ఏర్పాటైంది. దేశంలో మార్పు కోసం మహారాష్ట్ర నాంది పలకాలి. దేశంలో కాంగ్రెస్ 50 ఏళ్లు, బీజేపీ 16 ఏళ్లుగా పాలిస్తున్నా తాగు, సాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. విద్వేష రాజకీయాల మూలంగానే కర్ణాటకలో బీజేపీని ఓడించి అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సమస్యలను పరిష్కరించడంతో రైతులు పూర్తి విశ్వాసం, సంతృప్తితో ఉన్నారు. రైతుబంధు, రైతు బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. దళితబంధు ద్వారా 50 వేల కుటుంబాలకు లబ్ధి జరిగింది. రైతురాజ్యం కోసం బీఆర్‌ఎస్ దేశవ్యాప్త ప్రయత్నాలు చేస్తోంది’అని కేసీఆర్ వెల్లడించారు.
కడదాకా నిలబడే సత్తా ఉంటేనే పార్టీలో చేరండి...
‘కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు, ప్రజల కోసం ఎందాకైనా పోరాడే తెగువ ఉన్నవారే బీఆర్‌ఎస్‌లో చేరండి. మన లక్ష్యం గొప్పదనే విషయాన్ని గుర్తించి నిత్యం ప్రజలతో మమేకమై చైతన్యపరచాలి. ఒకసారి అడుగు ముందుకేస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. త్వరలో పార్టీ కమిటీలు వేసుకుందాం. డిజిటల్ రూపంలో అందించే శిక్షణ తరగతుల సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరడంతోపాటు పార్టీ కమిటీలు ఉండాలి. ఆటోలు, ట్యాక్సీలపై స్టిక్కర్లు, పాటలకు విస్తృత ప్రచారం, సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టండి’అని కేసీఆర్ సూచించారు. మహరాష్ట్ర బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా దేశ్‌ముఖ్ పేరును ఖరారు చేశారు.
నాందేడ్‌లో ఘన స్వాగతం...
నాందేడ్‌లో రెండు రోజులపాటు జరిగే బీఆర్‌ఎస్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం 11:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. నాందేడ్‌లో శిక్షణ జరిగే అనంత్‌లాన్స్‌కు చేరుకొని శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. శివాజీ, అంబేడ్కర్, ఫూలే తదితర మహనీయుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముగ్గురేసి చొప్పున ఎంపిక చేసిన నేతలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ ముగిశాక నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లను పార్టీ బాధ్యులకు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు, మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కతిక భాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేస్తామన్నారు. శిక్షణ శిబిరం వేదికగా మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment