
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత పని విభజన ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీ అప్పజెప్పనుంది.
వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యక్షులను కూడా నియమించనుంది. ఈ క్రమంలోనే ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులకు ఏ పార్లమెంటు నియోజకవర్గం అప్పగించాలన్న దానిపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని సమన్వయకర్తగా నియమించాలని, ఒక పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు ఉపాధ్యక్షులు కలిపి మొత్తం ఆరుగురు నాయకులను ఒక లోక్‌సభ నియోజకవర్గంలో రంగంలోకి దింపనుంది.
ఎక్కడా సమన్వయ లోపం లేకుండా..
గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వరకు ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసేందుకు ఈ పని విభజన చేపడుతున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నాయకులకు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెబుతున్నాయి. ఒకవేళ వీరిలో ఎన్నికల్లో పోటీ చేసే నేతలున్నట్టైతే వారి స్థానాలకు వెళ్లిపోతారని, మిగిలిన వారంతా ఆ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పనిచేస్తారని తెలిపాయి.
కిందిస్థాయి నుంచి పైవరకు అన్ని వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతతో పాటు సమన్వయం, పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల అమలు లాంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ఇన్‌చార్జులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి అనుగుణంగా ఎన్నికల సమయంలో పనిచేయించడంతో పాటు ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతను ఈ ఇన్‌చార్జులు తీసుకుంటారని, అంతర్గత సమస్యల నుంచి ఎన్నికల సంఘం సూచనల వరకు అన్ని అంశాల్లోనూ ఈ ఆరుగురు నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసే వరకు అక్కడే..
స్థానిక నేతలు, పార్టీ తరఫున అసెంబ్లీ.. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఆరుగురు నేతలు వారికి కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గంలోనే పని చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ జాబితాను కూడా త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం.